Sirikonda | సిరికొండ, జులై 3 : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ హరిత దళం (ఎన్జీసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన పర్యావరణ సంక్షోభం. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తూ జీవవైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ ఒక్కరూ తమ నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు గుడ్డ సంచులు, కాగితపు సంచులను తప్పనిసరిగా వాడాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులే మార్పుకు నాంది పలకాలి అని సూచించారు. అనంతరం ప్లాస్టిక్ నియంత్రణ, దాని దుష్ప్రభావాలపై రూపొందించిన అవగాహన గోడపత్రులను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్జీసీ ఇన్చార్జి ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.