వేల్పూర్, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం అండగా నిలబడేందుకు తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా అమలు చేయాలని మాజీ మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం వేల్పూర్‌లో నిర్వహించిన ధర్నాలో వేముల మాట్లాడారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహిళలతో కలిసి తహసీల్దార్‌కు సమర్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఈ మేరకు కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని, మహిళలకు, రైతులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. పేదల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ వరకు పోరా టం ఆగదని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పేదల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పదేండ్లుగా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో కేసులు వేయించిందని ఆరోపించారు. ‘ఆసరా’ కింద కేసీఆర్ రూ.2 వేలు చొప్పున పెన్షన్ ఇస్తుంటే, రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటివెలుగు తదితర కార్యక్రమాలను రేవంత్ సర్కారు నిలిపి వేసిందన్నారు.
రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని, రూ.15 వేల చొప్పున రైతుభరోసా అమలు చేయలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అనేక నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతేకాదు, రూ.500 బోనస్ ఎగ్గొట్టాలని ప్రభుత్వం చూస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన ఎరువుల యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాగుకు నిరంతర విద్యుత్ ఇవ్వడం లేదని, గృహ విద్యుత్ సరఫరాలోనూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం మొత్తం భూములు దోచుకుంటుంటే, ఇక్కడ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ కార్యకర్తలు పంచుకుని దోచుకుంటున్నారని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మొరం, గుట్టలు వంటి సహజ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదన్నారు. తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లలో అధికార పార్టీ నాయకులు, పైరవీకారుల జోక్యం పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి తప్ప రాజకీయ పైరవీలకు వేదికలుగా మారకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి దోచుకోవడంపైనే శ్రద్ధ పెట్టిందన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందనడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. పేదల హక్కులు అడిగితే లాఠీచార్జి చేయటం సరికాదని, కలాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల కేసులు పెట్టారని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తున్నదని వేముల విమర్శించారు. కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా మారి వారి వివాహలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మందికి రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం అందజేశారని గుర్తు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన మూడేండ్లు దగ్గరకొస్తున్నా ఇప్పటిదాకా అమలు చేయలేదని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం చొప్పున బకాయి పడిందన్నారు.