ఎండలు ముదరక ముందే చెరువులు ఎండి పోయేవి.. ఆయకట్టు కింది పొలాలు ఎడారిని తలపించేవి.. యాసంగిలో పంటల సాగు దుర్భరంగా ఉండేది. కానీ మిషన్ కాకతీయ పథకం అమలు తర్వాత ఆయకట్టు జీవం పోసుకున్నది. యాసంగిలోనూ పచ్చని వరి పంటలతో రైతులను మురిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో రెండింతల మేర సాగు విస్తీర్ణం పెరగడం విశేషం. మొత్తం 1200 చెరువులు ఉండగా, వీటి ద్వారా ఎండాకాలంలో 40 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందేది. మిషన్ కాకతీయ పుణ్యమా అని ఇప్పుడది 1.11 లక్షల ఎకరాలకు చేరింది. ఇక, కామారెడ్డి జిల్లాలోనూ భారీగా పంటల సాగు పెరిగింది. సీఎం కేసీఆర్ సమగ్ర ప్రణాళిక, పటిష్ట కార్యాచరణ ఫలితంగా మండుటెండల్లోనూ చెరువులు కళకళలాడుతున్నాయి. కాల్వల్లో నీళ్లు పారుతున్నాయి. ఆయకట్టు కింది పొలాలు పచ్చబడ్డాయి. ఇదీ ‘మిషన్ కాకతీయ’ వైభవం.. రైతన్నలకు సర్కారు అందించిన వైభోగం..
నిజామాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు బోసిపోయిన చెరువుల కింద ఆయకట్టు ఇప్పుడు పచ్చని కోక చుట్టుకున్నట్లు కనిపిస్తున్నది. యాసంగిలో సమృద్ధిగా నీటి నిల్వ ఉండడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో అమలైన మిషన్ కాకతీయ పథకం ఇప్పటికీ మంచి ఫలితాలను అందిస్తున్నది. కాలువల ఆధునీకరణ, తూముల రిపేర్లు, చెరువుల్లో పూడికతీతతో వానాకాలంలో నిల్వ అయిన జలాలు యాసంగిలో పంటల సాగునీటి అవసరాన్ని తీరుస్తున్నాయి. తద్వారా చెరువుల కింద ఆయకట్టు 60 నుంచి 90శాతానికి పెరిగినట్లు జలవనరుల శాఖ లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1200 చెరువులున్నాయి. వీటి పరిధిలో యాసంగిలో ఒకప్పుడు 40 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందేది. ఇప్పుడేమో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. 1.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండడం మిషన్ కాకతీయ పథకం గొప్పదనానికి నిదర్శనం. కామారెడ్డి జిల్లాలోనూ చెరువుల కింద ఆయకట్టు భారీగా పెరిగింది. మిషన్ కాకతీయ పనుల సమయంలో పూడిక మట్టిని వినియోగించుకున్న రైతుల భూముల్లో పంటల దిగుబడి సైతం భారీగా వస్తున్నది.
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా నీటి వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరైన కాలువలు లేక వర్షపు నీరు వృథాగా పోయేది. సామర్థ్యం ఉన్నప్పటికీ చెరువుల్లోకి వరద నీరు చేరే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకంతో అనేక చెరువులకు కొత్త కళ వచ్చింది. పునరుద్ధరణ, శాశ్వత మరమ్మతు పనులతో ఇప్పుడు ఎక్కడ చూసినా తటాకాల్లో పుష్కలంగా నీళ్లు నిల్వ ఉన్నాయి. వాటి ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
కామారెడ్డి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో కరువు ప్రాంతంగా ముద్ర పడింది. కానీ ‘కాకతీయ’ ఫలితంగా ఇప్పుడు పంటల ఉత్పత్తిలో మిగతా జిల్లాలతో పోటీ పడుతుండటం విశేషం. జిల్లా వ్యాప్తంగా 1,954 చెరువులు, కుంటలున్నాయి. వీటి ద్వారా 97,881 ఎకరాల ఆయకట్టుకు ప్రాణం పోసినట్లు అయ్యింది. 100 ఎకరాలకు పైబడిన 194 చెరువుల పరిధిలో 46,338 ఎకరాలు, 100 ఎకరాల్లోపు ఆయకట్టు సామర్థ్యం కలిగిన 1,056 చెరువుల్లో 39,803 ఎకరాలు సాగవుతున్నాయి. 721 కుంటలు, చిన్నపాటి నీటి వనరుల కింద 12,400 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.
మిషన్ కాకతీయ పథకం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టు పెరిగిందన్న విషయం అక్షర సత్యం. గతంతో పోలిస్తే చెరువుల ఆయకట్టు కింద పెరిగిన సాగు విస్తీర్ణమే ‘మిషన్’ విజయవంతానికి నిదర్శనం. నిజామాబాద్ జిల్లాలో నాలుగు విడుతల్లో వందలాది చెరువులకు పూర్వవైభవం వచ్చింది. ప్రధానంగా చెరువుల్లో నీటి నిల్వ మూలంగా భూగర్భ జలాలు సైతం పెరుగుతుండడం శుభ పరిణామం.
– మధుసూదన్, ఇరిగేషన్ సీఈ, నిజామాబాద్ జిల్లా
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మిషన్ కాకతీయ పథకం అంటే చెరువులను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు. వర్షపు నీటిని 10 నెలల పాటు నిల్వ చేసుకుని ఆయకట్టుకు కొరత లేకుండా సాగు నీరు అందించడం ప్రధానమైన ధ్యేయం. తటాకాల్లో పూడికతీత పనులు చేపట్టం ద్వారా చెరువుల సామర్థ్యం పెరిగింది. గతంలో దశాబ్దాలుగా కూరుకుపోయిన పూడికను తీయడం ద్వారా చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వర్షపు నీరు ఎక్కువగా నిల్వ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పడటానికి ముందు వరకు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగలు పడడం, గండి పడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. ఇప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేయడం ద్వారా చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. లీకేజీలతో కొట్టుమిట్టాడిన తూములు బాగుపడడంతో ఇబ్బందులు లేకుండా పోయాయి. చెరువు చుట్టు ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి.