బోధన్, నవంబర్ 21 : శిక్షణ పూర్తిచేసుకున్న ఏఆర్ కానిస్టేబుళ్లు నిజాయితీ, అంకితభావంతో పనిచేసి తెలంగాణ పోలీసు వ్యవస్థకు మరింత గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో ఉన్న నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 250 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు 9 నెలలుగా కొనసాగుతున్న శిక్షణ గురువారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ‘దీక్షాంత్ పరేడ్’ (అవుట్ పాసింగ్ పరేడ్) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీజీ డైరెక్టర్ జనరల్ అనిల్‌కుమార్ హాజరై, శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులు విధి నిర్వహణతోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పాటించాలని అన్నారు. రాష్ట్రంలోని 16 పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో 8,149 మంది శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు ఉద్యోగాల్లో చేరనున్నారని వెల్లడించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి సీపీ, కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ, పోలీసు అధికారులతో కలిసి కానిస్టేబుళ్ల పరేడ్‌ను వీక్షించారు. పరేడ్ అనంతరం కానిస్టేబుళ్లతో టైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు ప్రతిజ్ఞ చేయించారు.
శిక్షణ పూర్తిచేసుకున్న పరేడ్‌ను వీక్షించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కోలాహలంగా మారింది. కార్యక్రమం పూర్తయిన అనంతరం కానిస్టేబుళ్లు వారి కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగాల్లో చేరనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో పోలీసు టోపీలను ధరింపజేసి ఆనందక్షణాలు పంచుకున్నారు.
తోటి కానిస్టేబుళ్లు, కుటుంబీకులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా తాళ్లకొండపల్లి మండలం చెన్నంపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పబ్బతి రాఘవేందర్, పబ్బతి శివకుమార్ పరేడ్‌ను చూసేందుకు వారి తల్లిదండ్రులు మణెమ్మ-ఆంజనేయులు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూరు నుంచి ఇక్కడికి వచ్చారు. తమ ఇద్దరు కుమారులు ఒకేసారి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడంతో సంబురపడ్డారు. ఆ అన్నాదమ్ములిద్దరూ తమ టోపీలను తల్లిదండ్రులకు పెట్టి, పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.