వేల్పూర్, ఆగస్టు 26: రైతు నేపథ్యమే ఆయన రాజకీయ పునాది.. రైతు సంక్షేమమే ఆయన అభిలాష.. ఆయ న జీవితం ప్రజలతో మమేకమైన ప్రయాణం.. మరుపురాని నాయకు డు.. రైతుల మదిలో నిలిచిన నేత వేముల సురేందర్‌రెడ్డి. నేడు ఆయన ఆరో వర్ధంతి. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ఆయన.. రాజకీయ నేపథ్యం రైతు నాయకుడిగా ప్రారంభమైంది. ఎన్నో రైతు ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. జీవితమంతా రైతుల పక్షాన గళం వినిపించారు.
కేసీఆర్‌పై విశ్వాసంతో ఉద్యమంలోకి..
తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో సురేందర్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. టీడీపీలో ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రుడిగా కొనసాగారు. ఆయన సీఎం పదవి నుంచి వైదొలగిన సందర్భంలోనూ అధికార పక్షాన్ని వీడి ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. ఆది నుంచి తెలంగాణ వాది కావడంతో 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం వైపు అడుగుపెట్టారు. ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో టీఆర్ఎస్లో చేరారు. సురేందర్‌రెడ్డికి రైతు నాయకుడిగా కేసీఆర్ ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రైతు సంక్షేమ పథకాల రూపకల్పనలో కేసీఆర్ ఆధ్వర్యంలో పాలు పంచుకున్నారు. 2002 నుంచి ఆయన చనిపోయే వరకూ టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ మార్గంలో ప్రజలకు సేవలు అందించవచ్చని నమ్మిన ఆయన.. తన పెద్ద కుమారుడు ప్రస్తుత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రాజకీయ నిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాకారం కావడాన్ని చూసిన కొందరు నాయకుల్లో ఆయన ఒకరు.
చెట్లు అంటే ప్రాణం..
వేముల సురేందర్‌రెడ్డికి మొక్కలను సంరక్షించడం హాబీ. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం ఆయన ఎంతో ప్రచారం చేశారు. యువకులతో కలిసి వేల్పూర్‌లో వెయ్యి మొక్కలు నాటారు. పలు గ్రామాల్లో మొ క్కల సంరక్షణకు కంచెలు ఏర్పాటు చేయించారు.
ఉత్తమ క్రీడాకారుడు..
సురేందర్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ప్రాణం. విద్యార్థి దశలో క్రీడల్లో రాణించేవారు. క్రీడాకారులను ప్రోత్సహించేవారు. ఆయన వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో కొడుకు ప్రశాంత్‌రెడ్డి సైతం వాలీబాల్ జాతీయస్థాయి క్రీడాకారుడిగా రాణించారు. సురేందర్‌రెడ్డి మరణం అనంతరం ఆయనకు ఇష్టమైన వాలీబాల్‌తోపాటు ఇతర క్రీడల్లో స్మారకపోటీలను అభిమానులు నిర్వహిస్తున్నారు.
ఆకలి విలువ తెలిసిన అన్నదాత
2005లో వేల్పూర్‌లో వంద మంది పేద వృద్ధులకు నెల రోజులపాటు సొంత ఖర్చులతో రెండు పూటలా ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవిలో వృద్ధులు పట్టెడు అన్నం కోసం పడుతున్న తిప్పలు చూసి ఈ కార్యక్రమం చేపట్టారు.
కేసీఆర్‌తో విడదీయరాని బంధం
సురేందర్‌రెడ్డికి కేసీఆర్‌తో విడదీయరాని బంధం ఉండేది. టీడీపీలో మొగ్గ తొడిగిన వీరిద్దరి మైత్రి తెలంగాణ ఉద్యమంలో స్నేహ పుష్పమై వికసించింది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొ న్నారు. సీమాంధ్ర శక్తుల పన్నాగాలతో కొందరు కేసీఆర్‌ను వీడినా సురేందర్‌రెడ్డి మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారు. సురేందర్‌రెడ్డి అంత్యక్రియలకు కేసీఆర్ హాజరై కంటతడి పెట్టారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి వేముల సురేందర్‌రెడ్డి పేరు నామకరణం చేశారు.Today is Vemula Surender Reddy’s sixth month vardadnthi