నిజామాబాద్ కల్చరల్, ఆగస్టు 24 : వరాలు ప్రసాదించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి భక్తులు సన్నద్ధమయ్యారు. శ్రావణమాసంలో రెండో శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇండ్లల్లో వరలక్ష్మీ వ్రతాలకు అవసరమైన పూజా సామగ్రి , పూలు కొనుగోలు చేసేందుకు భక్తులు తరలిరావడంతో మార్కెట్ సందడిగా మారింది. జిల్లా కేంద్రంలోని దేవీరోడ్ దేవిమాత ఆలయం, దుబ్బ మహాలక్ష్మీ ఆలయం, న్యాల్కల్రోడ్ లలితాదేవి ఆలయం, శివాజీనగర్ గీతా మందిరం, కిషన్గంజ్ వాసవీ కన్యకా పరమేశ్వరీ, గాయత్రీ మాత, కోటగల్లి మా ర్కండేయ మందిరం, నాగారంలోని లక్ష్మీ కుబేర ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
వరలక్ష్మీ వ్రత ప్రాశస్త్యం
సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. అన్ని మాసాల్లో కన్నా శ్రావణమాసం శివకేశవులతో పా టు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొదటగా లక్ష్మీదేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. విష్ణుమూర్తిని నారాయణ స్వరూపుడిగా లక్ష్మీదేవిని వరలక్ష్మీగా భావించి వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. స్కంద పురాణంలో సైతం శివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యతను గురించి వివరించారు. వ్రతం ఆచరించి తోటి సుహాసినులకు పసుపు, కుంకుమలు అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు. చారుమతి కథను చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పెండ్లి అయిన ప్రతి మహిళా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతారు.
వ్రత శుభ సమయాలు
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం ఉదయం సింహ లగ్నంలో 5.50 నుంచి 7.40, వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 12.15 నుంచి 2.30 వరకు లేదా సాయంత్రం కుంభలగ్నంలో 6.10 నుంచి 7.55 వరకు ఆచరించాలని వేదపండితుడు ప్రకాశ్శర్మ తెలిపారు.
పూల, పండ్ల ధరలకు రెక్కలు
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని పూలు, పండ్లు ధరలకు రెక్కలొచ్చాయి. కిలో చామంతి పూలు. రూ. 300, బంతి పూలు రూ. 200, మల్లెపూలు రూ. 500, గులాబీ ఒక్కొక్కటి రూ.10 చొప్పున విక్రయించారు. డజన్ అరటిపండ్లు రూ. 70, కిలో ఆపిల్ పండ్లు రూ.150 ధర పలుకుతున్నాయి.