వేర్వేరు ్రప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో భోగి పండుగ పూట ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద హైవేపై జరిగిన ప్రమాద ఘనటలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతిచెందగా.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై సుద్దపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యవకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో యువకుడు హైదరాబాద్‌కు శనివారం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన నల్ల అఖిలేశ్, ఘన్పూర్ గ్రామానికి చెందిన ధీరజ్, ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లికి చెందిన రుషికేశ్ గౌడ్ ముగ్గురు స్నేహితులు. అఖిలేశ్(22), రుషికేశ్గౌడ్(22) హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు.
సంక్రాంతి సెలవుల కోసం వచ్చిన వారు డిచ్‌పల్లిలో కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి రుషికేశ్ గౌడ్‌ను ఆర్మూర్‌లో దించేందుకు బైక్‌పై వెళ్తుండగా సుద్దపల్లి శివారులో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వ్యాన్ బైకును ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వీరిని జిల్లా కేంద్ర దవాఖానకు స్థానికులు తరలించే ప్రయత్నం చేయగా.. ఘటనా స్థలంలోనే రుషికేశ్గౌడ్ మృతి చెందాడు. అఖిలేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు శనివారం మధ్యాహ్నం తరలిస్తుండగా కామారెడ్డి శివారులో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘన్‌పూర్‌కు చెందిన ధీరజ్‌కు తీవ్ర గాయాలు కాగా.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అఖిలేశ్ మృతితో తండ్రి పండరి, తల్లి భారతి, పెద్దనాన్న హరికిషన్, పెద్దమ్మ లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లింగంపేట మండలంలోని సజ్జన్పల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లం సత్యరాజు (25) మృతి చెందినట్లు ఎస్సై శంకర్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలంలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతానికి చెందిన సత్యరాజు శుక్రవారం సజ్జన్పల్లి గ్రామానికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డికి తిరిగి వెళ్తుండగా సజ్జన్పల్లి గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నది. ప్రమాదంలో తల, ముఖంపై బలమైన గాయాలు కావడంతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అల్లం ప్రేమమది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి సర్కారు దవాఖానకు తరలించినట్లు ఎస్సై వివరించారు.