మాక్లూర్, డిసెంబర్ 29:
తనకు అంగవైకల్యం ఉన్నదనే ఆలోచనే దరిదాపులకు రానివ్వకుండా అకుంఠిత దీక్షతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఆద్శరంగా నిలుస్తున్నాడు ఒక మాస్టారు. తాను ఏ పాఠశాలలో విధులు నిర్వహించినా.. ఇప్పటి వరకు తన సర్వీసులో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. రాష్ట్రస్థాయిలో మూడుసార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు అందుకొని స్ఫూర్తినింపాడు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్‌బండార్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు పురం బస్వయ్య. తనకు వైకల్యం ఉన్నప్పటికీ 20ఏండ్ల సర్వీసులో ఏ ఒక్కరోజు కూడా బడికి సెలవు పెట్టడం, ఆలస్యంగా వెళ్లడం లాంటివి ఉండకపోవడం విశేషం.
టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన పురం బస్వయ్య చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవారు. 7వ తరగతి చదివేటప్పుడు ‘ఎన్టీఆర్ విజ్ఞాన పారితోషికం’ అవార్డును అందుకున్నారు. 2002 డీఎస్సీలో ఒకే దఫా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అదే సమయంలో విజయవాడలో టికెట్ కలెక్టర్ ఉద్యోగానికి కూడా ఎంపికైనా ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. 2002లో మొదటి పోస్టింగ్ హన్మాజీపేట్ జడ్పీహెచ్ఎస్, 2005-2015 వరకు దామరంచ పాఠశాలలో పనిచేశారు. ఇదే సమయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు ఆయన పాఠశాలకు సెలవు పెట్టకుండా, ఆలస్యంగా వెళ్లకుండా అందరి మన్ననలు అందుకుంటున్నారు.
ఉత్తమ ఉద్యోగిగా..
బస్వయ్య సేవలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2022 విద్యాసంవత్సరానికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగిగా అవార్డును రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో రెండు అవార్డులు మాత్రమే ఉండగా అందులో ప్రథముడిగా బస్వయ్య ఉండడం విశేషం.2022లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మేయర్ నీతూకిరణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మండల ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అందజేశారు.
ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తా..
ఉద్యోగం అనేది బాధ్యతగా భావిస్తాను. ప్రభుత్వం ఇచ్చే సెలవుల్లో సగం కూడా తీసుకోను. పర్సనల్ సెలవులు అసలే తీసుకోను. పాఠశాలకు ఆలస్యంగా వెళ్లకుండా, సెలవు తీసుకోకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికతో ఉంటాను. అంగవైక్యలంతో ఇబ్బందులు కలిగినా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తాను. తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉన్నది.
-పురం బస్వయ్య, గణిత ఉపాధ్యాయుడు