నిజామాబాద్ రూరల్, ఆగస్టు 24: రానున్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీల నాయకులను నమ్మవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు సూచించారు. రూరల్ మండలంలోని కొండూర్ గ్రామంలో రూ.50లక్షలతో చేపట్టనున్న మహాలక్ష్మీ ఆలయ నిర్మాణానికి గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మా ట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ తాను గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, పసుపు రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎంపీగా గెలిచి నాలుగు న్నరేండ్లు గడుస్తున్నా పసుపు బోర్డు హామీ నీటిమూటగానే మిగిలిపోయిందన్నారు. జిల్లా అభివృద్ధికి నయా పైసా కేటాయించిన దాఖలాలు లేవన్నారు. తాను రూరల్ నియోజకవర్గంలో రూ. కోట్లతో చేసిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయ బోర్లకు మూడు గంటల కరెంట్ మాత్రమే సరిపోతుందని ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ మాత్రమే పాటుపడుతున్నారని, మళ్లీ ఆయనకు పట్టం కట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ అనూషాప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
78 కార్యదర్శులకు ఉత్తర్వు కాపీల అందజేత
నిజామాబాద్ రూరల్/ ఖలీల్‌వాడీ(మోపాల్), ఆగస్టు 24 : రూరల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన (డిచ్పల్లి 27, ఇందల్వాయి 9, జక్రాన్‌పల్లి 15, మోపాల్ 9, నిజామాబాద్ రూరల్ 8, సిరికొండ 10) జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను బాజిరెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధిచేయడానికి క్షేత్రస్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టిందని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కార్యదర్శుల బాధ్యత కూడా ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఫలితంగానే గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు.
కార్యదర్శుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. మన రాష్ట్రంలో ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు ఇతర రాష్ర్టాల్లో లేవన్నారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. పల్లెప్రగతిలో వారి పనితీరును లెక్కలోకి తీసుకొని 70 శాతం మార్కులు సాధించిన వారికి తొలివిడుతగా ఉత్తర్వు కాపీలను అందించినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీపీవో జయసుధ, డీఎల్పీవో నాగరాజు, వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.