ముంబై, మే 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని అడవిలో తునికాకు (బీడీ ఆకులు) ఏరుకోవడానికి వెళ్లిన పలువురు మహిళలపై ఆడ పులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గుంజవాహి అడవిలో 13 మంది మహిళల బృందం బీడీ ఆకులు సేకరిస్తుండగా, ఒక ఆడపులి అకస్మాత్తుగా ఈ మహిళలపై దాడి చేసింది. ప్రాణభయంతో వారంతా పరుగులు తీశారు. అయితే ఇంతలో ఆ పులి నలుగురు మహిళలను పొట్టన పెట్టుకుంది. మిగిలిన మహిళలు కేకలు వేస్తూ పారిపోయి గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే వారు కర్రలతో సంఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చారు. అకడ నలుగురు మహిళల మృతదేహాలు కనిపించాయి.