రెంజల్, డిసెంబర్ 23 : నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని సరస్వతీ కాలనీలో వృద్ధ దంపతులు జల్ల చిన్న నాగన్న-శంకుతల నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాము, లక్ష్మణ్ ఉన్నారు. వీరు గ్రామంలోనే వేరుగా నివాసం ఉంటున్నారు. వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు పదునైన అయుధాలతో దాడి చేసి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు పడిగెలు, గుండ్లు ఎత్తుకెళ్లారు. ప్రతి రోజులాగే శుక్రవారం ఉదయం లక్ష్మణ్ కుమారుడు వర్ధన్ తాత ఇంటికి వచ్చాడు. తలుపు తీసి ఉండడం.. తాత, నానమ్మ అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. తీవ్ర గాయాలైన ఇద్దరిని 108 అంబులెన్సులో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు తెలిపారు.
రంగంలోకి డాగ్ స్కాడ్, క్లూస్ టీం
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్కాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి వివరాలను సేకరించారు. బోధన్ రూరల్, రుద్రూర్ సీఐలు శ్రీనివాస్‌రాజు, జాన్‌రెడ్డి, రెంజ ల్, ఎడపల్లి, బోధర్ రూరల్ ఎస్సైలు నారాయణ్‌సింగ్, పాండేరావు, లోకం సందీప్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలోనే దుండగులను పట్టుకుంటాం
రెంజల్లో వృద్ధ దంపతులపై దాడికి కారణమైన దుండగులను త్వరలోనే పట్టుకొని తీరుతామని బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ అన్నారు. రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.