నస్రుల్లాబాద్, మార్చి 30: ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. బీర్కూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అయాజ్ ఖాన్, మహమ్మద్ సమీరుద్దీన్ శనివారం ఉదయం బీర్కూర్ మండల కేంద్రంలోని కమాన్ వద్ద నంబరు ప్లేటు లేని పల్సర్ బైక్‌పై వస్తూ అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు.
పోలీసులు వారిని పట్టుకొని విచారించగా ఆరు నెలలుగా మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, సదాశివనగర్, గాంధారి, భిక్కనూర్, నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, ఇందల్వాయి, సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట్, కల్హేర్, ఇతర పోలీస్స్టేషన్ల పరిధిలో ఇండ్లముందు పార్కింగ్ చేసిన బైక్‌లను రాత్రివేళలో దొంగిలించేవారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. బీర్కూర్‌లో ఉదయం 5గంటలకు బైక్‌ను దొంగిలించేందుకు రాగా పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో దొంగిలించిన మొత్తం 26 బైక్‌లను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు యువకులు, ఒక మైనర్ ఉన్నట్లు వివరించారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణగౌడ్, బీర్కూర్ ఎస్సై రాజశేఖర్, పిట్లం ఎస్సై నరేశ్, సిబ్బంది వస్సీ, రఘు, సాయిబాబ, శివచరణ్, సంగమేశ్వర్, అశోక్‌ను అభినందించారు.