కోటగిరి/ డిచ్పల్లి/ధర్పల్లి/ జక్రాన్‌పల్లి/ సారంగపూర్/ వర్ని/ బాల్కొండ/ భీమ్‌గల్/ మోర్తాడ్/ ఏర్గట్ల/ మాక్లూర్/రెంజల్/ ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 2 : సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన షురూ అయ్యింది. ఒక్కో అధికారి ఒకటి, రెండు గ్రామాల చొప్పుల బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతు సేవలు అందిస్తామని తెలిపారు. కోటగిరిలో ప్రత్యేక అధికారులను సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సిబ్బంది అధికారులను సన్మానించారు. డిచ్పల్లి మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీడీవో గోపీబాబు తెలిపారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ధర్పల్లి మండలంలోని 22 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. ధర్పల్లి, సీతాయిపేట్, మరియా తండా ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టి మాట్లాడారు.
జక్రాన్‌పల్లి మండలకేంద్రంతోపాటు బ్రాహ్మన్పల్లిలో గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా ఎంపీడీవో బ్రహ్మానందం బాధ్యతలు చేపట్టారు. గ్రామస్తులు ఆయనను సన్మానించారు. రూరల్ మండలంలోని గుండారం మేజర్ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా శుక్రవారం రూరల్ మండల తహసీల్దార్ అనిరుధ్ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో లక్ష్మణ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌రావు, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ అంకల గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ శంకర్‌రెడ్డి, ఆఫీసర్‌ను స్వాగతించి సన్మానించారు. వర్ని మండలంలోని 22 గ్రామాలకు 11 మంది ప్రత్యేక అధికారులను నియమించగా.. వారు బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండలో ఎంపీడీవో సంతోష్‌కుమార్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. భీమ్‌గల్ మండలంలోని 27 గ్రామాలకు 13 మంది ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. బాచన్‌పల్లిలో తహసీల్దార్ వెంకటరమణ, బడాభీమ్‌గల్‌లో ఎంపీడీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. మోర్తాడ్, గాండ్లపేట్ గ్రామాలకు ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, దోన్పాల్, సుంకెట్ గ్రామాలకు తహసీల్దార్ సత్యనారాయణ, తిమ్మాపూర్, వడ్యాట్ గ్రామాలకు ఎంపీవో శ్రీధర్, ధర్మోరా, శెట్పల్లి గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వరాజ్, దొన్కల్ గ్రామానికి ఏవో లావణ్య, పాలెం గ్రామానికి సూపరింటెండెంట్ లింగన్న ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరించారు. ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.
గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్ గ్రామాలకు తహసీల్దార్ యూసుఫ్, తొర్తి, దోంచంద గ్రామాలకు మండల వ్యవసాయధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, ఏర్గట్ల, బట్టాపూర్, నాగేంధ్రనగర్ గ్రామాలకు ఎంపీవో శివచరణ్, తడ్పాకల్ గ్రామానికి పీఆర్ ఏఈ విక్రం ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరించారు. అధికారులను ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లె రాజేశ్వర్, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, మండల కోఆప్షన్ మెంబర్ అష్రాఫ్, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు తదితరులు అభినందించారు. మాక్లూర్ మండలంలో 30 జీపీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. మేజర్ గ్రామ పంచాయతీలు మాక్లూర్, కల్లడి గ్రామాలకు ఎంపీడీవో జైకా్రంతి, గుత్పకు తహసీల్దార్ ఎంఏ షబ్బీర్, గొట్టిముక్కలకు ఎంఈవో సచిదానందా, అమ్రాద్‌కు ఏఈ అన్వేష్‌రెడ్డి నియమితులయ్యారు. మిగతా జీపీలకూ స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పాలనలో ప్రజలకు ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చూడాలని జీపీ కార్యదర్శులకు ఎంపీడీవో శంకర్ సూచించారు. ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు.
ఆర్మూర్ మండలం చేపూర్ ప్రత్యేకాధికారిగా మండల పశు సంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. గ్రామంలో సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విరిగిపోయిన కిటికీని బాగు చేయించాలని, మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం కల్పించాలని కార్యదర్శి హరీశ్‌ను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలను కాపాడడానికి పైపులను ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జీపీ సిబ్బంది, ఎంపీటీసీ బాల నర్సయ్య తదితరులు ఉన్నారు.