వేల్పూర్ ,జూన్ 1: మలిదశ ఉద్యమానికి వేల్పూర్ మండలం మోతె గ్రామం దిక్సూచిగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతునిస్తామని 2001 మే 5వ తేదీన మోతె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఉద్యమ బాటలో మరెన్నో గ్రామాలు కదిలేలా స్ఫూర్తిని నింపింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మోతె స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేశారు. దివంగత ఉద్యమ నేత వేముల సురేందర్ రెడ్డితో కలిసి మోతెకు వచ్చారు. మోతె గడ్డ మీది మట్టిని ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక తిరిగి ఆ మట్టి ముడుపును మోతె గడ్డపైనే విప్పుతానని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 మార్చి 28న వేముల సురేందర్ రెడ్డి, ఆయన తనయుడు అప్పటి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తదితర నాయకులతో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు. అనంతరం 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోతె టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవ తీర్మానాలతో అండగా నిలిచింది. అదే తరహాలో మోతెను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానిస్తారు.