Chilkur Shiva Temple | శక్కర్ నగర్ : ప్రతీ దేవాలయంలో నిత్య దీపారాధన జరిపించాలని చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు, నర్సాపూర్ సంజీవనీ ఆంజనేయ స్వామి వ్యవస్తాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ అన్నారు. సంజీవనీ ఆంజనేయ స్వామి ఆలయంలో వివిధ గ్రామాలకు చెందిన ఆలయాలకు ఆయన దీపారాధన కు నూనె పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండేళ్ల కాలంగా ఆలయాల్లో దీపారాధనకు నూనె పంపిణీ చేస్తున్నామని, దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలు నిరాధారణకు గురై దీపారాధన జరగడం లేదనే ఉద్దేశ్యంతో దాతల సహకారం తో ప్రతీ నెల నూనె పంపిణీ చేస్తున్నామన్నారు.
ఆయా ఆలయాల కమిటి నిర్వాహకులు నూనె సద్వినియోగం చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలను నిత్యం ఆలయాలకు వచ్చేలా సూచించాలని, ఆలయాల్లో క్రమం తప్పకుండా నిత్యం ఉదయం, సాయంత్రం పూజాలతో పాటు దీపారాధన జరిపించాలన్నారు. ఆలయాల్లో దీపారాధనతో సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. మనదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు గొప్పవని, ప్రపంచంలోని పలు దేశాలు మన సాంప్రదాయాలపై మొగ్గు చూపుతున్నారని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రతీ నెలా పంపిణీ చేస్తున్న నూనె తో పాటు ఈ సారి నోట్ బుక్కులు, ప్రసాదం గా మీశ్రీ ( కదిశక్కర ) అందచేశారు. ఈ కార్యక్రమం లో సురేష్ ఆత్మరాం మహారాజ్ తో పాటు సంజీవనీ హనుమాన్ ఆలయ పూజారి అభిషేక్ శర్మ, వివిధ ఆలయాల నిర్వాహకులు పాల్గొన్నారు.