నందిపేట్, డిసెంబర్ 22 : సర్వమత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి తెలంగాణ ప్రతీక అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారిజీవన్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో జీవన్‌రెడ్డి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో జీవన్‌రెడ్డి స్వయంగా వడ్డించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు.
ప్రేమ, జాలి, దయ, కరుణ ప్రతిఒక్కరిపై చూపించాలన్నది యేసు క్రీస్తు బోధనల సారాంశమన్నారు. మైనార్టీల సంక్షేమానికి, విద్య, ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత డబ్బు లు ఖర్చు పెడుతున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయన్నారు.
తెలంగాణ వచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015-16 బడ్జెట్లో రూ.1,130 కోట్లు, 2016-17లో రూ.1,204 కోట్లు, 2017-18లో 1249.66 కోట్లు, 2018-19లో రూ.2వేల కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.2004 కోట్లు, 2020-21లో రూ.1518.06 కోట్లు, 2021-22లో రూ.1606.39 కోట్లు, 2022-23లో రూ.1728 కోట్లు కేటాయించినట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలోని నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్, క్రిస్మస్ విందులను ఏర్పాటు చేసి లౌకిక స్ఫూర్తిని చాటుకుంటున్నదన్నారు. ఆర్మూర్‌లో క్రైస్తవ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.10 కోట్ల విలువ గల భూమిని కేటాయించి, రూ.50లక్షలు మంజూరు చేశామన్నారు. మామిడిపల్లిలో నిర్మించిన ఆర్మూర్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు అదనంగా మరో రూ.10లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ వేణుగౌడ్, వైస్‌చైర్మన్ మున్నా, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకులు రవిగౌడ్, పండిత్ ప్రేమ్, నియోజకవర్గ పాస్టర్లు, బిషప్‌లు పాల్గొన్నారు.