ఖలీల్‌వాడి/ వినాయక్‌నగర్, ఏప్రిల్ 22 : జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో కొందరు మంగళవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చింపేశారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అడ్డుకున్నారు. పోస్టర్లను చింపివేసిన వ్యక్తులతోనే దగ్గరుండి అతికింపజేశారు. పోస్టర్ల చించివేతను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
పోర్టర్లను చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నగర అధ్యక్షుడు సిర్పరాజు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను కొందరు వ్యక్తులు దురుద్దేశంతోనే చింపి వేస్తున్నారని ఆరోపించారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు భారీ స్పందన వస్తుండడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.