నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కామారెడ్డి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు పంగానామాలు పెట్టి.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎడాపెడా జారీ చేసిన సిఫార్సు లేఖలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ రద్దుచేశారు. ఉపాధ్యాయులకు డీఈవో ఇచ్చిన పోస్టింగ్‌లు చెల్లవని కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కామారెడ్డి విద్యాశాఖ అధికారి తీరుపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఆయన నిర్ణయాలపై సమీక్షించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
డీఈవో తీరుపై ఉన్నతాధికారులు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు పేర్లు చెప్పి పలు చోట్ల అక్రమంగా ఎంఈవోలపై ఒత్తిడి తీసుకు వచ్చి సర్దుబాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ పనితీరులో అనవసరమైన జోక్యంతో ఓ వైపు శాసనసభ్యులు నవ్వుల పాలవ్వగా, మరోవైపు డీఈవో తీరుతో విద్యాశాఖ పరువు మంటగలుస్తున్నది. ఈనెల 6న ‘నమస్తే తెలంగాణ’ జిల్లా సంచికలో ‘సర్కారు జీవోకు సర్దుపోటు’ శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యాశాఖను కుదిపేసింది. కామారెడ్డి విద్యాశాఖలో కీలక అధికారికి మూడు నెలల క్రితమే బదిలీ జరిగినప్పటికీ కదలకుండా ఇక్కడే తిష్ట వేసుకోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరేండ్లలో రూ.కోట్లలో అవినీతి…
బోధనపై అవగాహన లేకుండా కామారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆరేండ్లుగా కొనసాగుతున్నారు. ఈ కాలంలో అక్రమ వ్యవహారాలు వేలల్లో జరగగా.. రూ.కోట్ల అవినీతి జరిగినట్లు ప్రచా రం జరుగుతున్నది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకొని విద్యాశాఖ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్లు వ్యక్తంమవుతు న్నాయి. జీవో నంబర్ 25ను అమలు చేయాలంటూ 2024, సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను తొక్కి పెట్టిన చందంగానే గతంలోనూ అనేక విధాలుగా ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉపాధ్యాయ సంఘాల నేతలకు తప్ప సామాన్య ఉపాధ్యాయుల బాధలను పట్టించుకునేవాడు కాదని వాపోతున్నారు. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ డీఈవోగా పనిచేసిన దుర్గాప్రసాద్‌పై ప్రభుత్వం మూడు రోజుల క్రితం బదిలీ వేటు వేసింది. కామారెడ్డిలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది.
రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు డిమాండ్..
ఆరేండ్ల కాలంలో ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పుకొని అక్రమంగా సంపాదించిన ఉన్నతాధికారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించారు. త్వరలో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అమలు చేయడం ద్వారా అక్రమార్జనను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇటీవల ఎంఈవో పోస్టుల భర్తీకి ముందు వరకు ఏండ్లుగా పాతుకుపోయిన మండల విద్యాశాఖ అధికారులు సైతం అవినీతిలో పాత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. వైజ్ఞానిక కార్యక్రమాల పేరుతో తిష్ట వేసుకున్న మరో టీచర్ సైతం ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ ప్రక్షాళన చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి.