నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు పడింది. తీవ్ర ఆరోపణలు రావడంతో టాస్క్ఫోర్స్ ఏసీపీని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. సదరు అధికారి వ్యవహార శైలిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనానికి ఉన్నతాధికారులు శరవేగంగా స్పందించారు.
ఏడాది కాలంగా నిజామాబాద్లో పని చేస్తున్న ప్రత్యేక విభాగం ఏసీపీని హైదరాబాద్కు బదిలీ చేశారు. జిల్లాలో టాస్క్ఫోర్స్ ఏసీపీగా ఉంటూ విచ్చలవిడితనంతో పోలీసుశాఖకు చెడ్డపేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 7వ తేదీన ‘ఆయన రూటే సెపరేటు’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అతని ఆగడాలను బట్టబయలు చేసింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పుచేసిన కానిస్టేబుళ్లు, ఎస్సైలపై చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు..
విచ్చలవిడిగా ప్రవర్తించిన ఏసీపీపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఎత్తిచూపింది. ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపిన ఈ కథనం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. సదరు ఏసీపీ తీరును సీరియస్గా పరిగణించిన సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ విచారణకు ఆదేశించారు. నిఘావర్గాల సమాచారం, విచారణ అధికారి ఇచ్చిన నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపారు. సీపీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఏసీపీని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. టాస్క్ఫోర్స్ ఏసీపీ ఇన్చార్జి బాధ్యతలను సీసీఎస్ ఏసీపీకి అప్పగించారు.