కంఠేశ్వర్ : వేసవి కాలంలో తాగునీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అధికారులను ఆదేశించారు. గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) , కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి రూ. 400 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిధులు మంజూరై ఆరునెలలు గడుస్తున్నా పనులు సక్రమంగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధుల వివరాలు, వాటి పురోగతిని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తాగునీరు, గోదావరి జలాలు, అమృత్ 1, అమృత్ 2, పారిశుధ్యం , రోడ్డు, డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు . ఈ సందర్భంగా టీజీవోస్ డైరీ , క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో
నుడా చైర్మన్ కేశవేణు, టీజీవో రాష్ట్ర , జిల్లా కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.