నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 1: గుడికెళ్తే మన బతుకులు మారుతాయో లేదో కాని, బడికెళ్తే మాత్రం విద్యార్థుల జీవితాలు తప్పకుండా మారుతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని పల్లెబొగుడ తండా పరిధిలో ఉన్న బొల్లారం తండాలో మన ఊరు- మనబడి కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ జితేశ్పాటిల్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపేటవేసి సర్కారు బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. పిల్లలను ప్రతిరోజూ బడికి పంపించాలని తల్లి దండ్రులకు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుంటే ఉన్నతస్థానంలో స్థిరపడతారని అన్నారు. మన ఊరు-మనబడి కింద మండలంలో 14 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు.
పల్లెబొగుడ తండాలో త్వరగా పనులుపూర్తికావడం గిరిజనుల అదృష్టమని అన్నారు. రూ. 30లక్షలతో అభివృద్ధి చేసిన బడిని ఓ గుడిలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. తానుకూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని, అప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉండే వి కావని తెలిపారు. ప్రతి పాఠశాలలో 12 రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దీబాయి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ నారాయణ, ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ లావణ్య, సర్పంచ్ చాంది, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, తహసీల్దార్ సయీద్ అహ్మద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్ధ య్య, కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.