కామారెడ్డి/ కంఠేశ్వర్, జనవరి 1 : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. విద్యా బోధన ఆపేసి, మహిళలు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. నిజామాబాద్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, యూటీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు.