రామారెడ్డి, డిసెంబర్ 1: నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన ఈశాన్య క్షేత్ర పాలకుడిగా సమస్త భక్తుల పూజలు స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్న స్వామి శ్రీకాలభైరవస్వామి. కాలభైరవుడికి కాలరాజు, కలుషాదుడు అనే పేర్లు కలవు. కాలభైరవ పూజ మంగళవారం అష్టమి తిథుల్లో చేసిన అధిక ఫలమిస్తుందని ప్రతీతి. స్వామి చుట్టూ 8 లేక 108 సార్లు ప్రదక్షిణ చేయడం ఇక్కడి సాంప్రదాయం. దేవాలయంపై గోపురం లేకపోవడం, అశ్వ తీర్థ వక్షం చాయలో ఉండడం ఎంతో పవిత్రమైంది. ప్రతి ఏటా శ్రీకాలభైరవస్వామి జన్మదినోత్సవ వేడుకలు ఐదు రోజులపాటు వైభవంగా జరుగుతాయి.
ఆలయాల్లో ఉన్న మూల బావి నీటితో రోగ పీడితులు 41 రోజులు రోజుకు రెండు సార్లు స్నానం ఆచరిస్తే పలు చర్మ వ్యాధులతోపాటు అఖండ సౌభాగ్యాలు, సంతానం కలుగుతాయని, వివాహం జరుగుతుందని అపార నమ్మకం. కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం కార్తిక బహుళ పంచమి నుంచి నవమి వరకు అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు సంతతాధారాభిషేకంతో ఆరంభమై చివరి రోజు రథోత్సవం, అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల నుంచి భక్తులు వస్తుంటారు.
శ్రీకాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 2వ తేదీన శనివారం ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణధారణ, సంతతధారాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు బద్ధి పోశమ్మకు బోనాలను సమర్పిస్తారు. 4వ తేదీన లక్ష దీపార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు, 5న ఉదయం సంతత ధారాభిషేకం సమాప్తి, ధ్వజా రోహణం, మహాపూజ, సిందూర పూజ, డోలారోహణం, సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన, రాత్రి బధ్రకాళి పూజ, పల్లకీ సేవ, రథోత్సవం, ఒగ్గుకథ కాలక్షేపం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6వ తేదీన అగ్నిగుండాలు నిర్వహిస్తారు.
ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఐదు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. వేడుకలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
కాలభైరవుడు భక్తుల కష్టాలను దూరం చేసి అండగా నిలిచే కరుణామూర్తి. స్వామి వారికి నిత్యం జలాభిషేకం, సిందూర పూజలు నిర్వహిస్తాం. అష్టమి తిథులతోపాటు శ్రావణ, వైశాఖ, కార్తిక మాసాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి.