బాన్సువాడ, మే 5: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన వీడియో కాల్ ద్వారా మండలంలోని కొల్లూర్ గ్రామ రైతులతో మాట్లాడారు. పలువురు రైతులు తమ సమస్యలను స్పీకర్‌తో విన్నవించుకున్నారు. బాన్సువాడ సొసైటీ నుంచి ఇబ్బందులు లేవని, ధాన్యం తీసుకెళ్లిన రైస్‌మిల్లర్లు తేమశాతం పేరిట అడ్డగోలుగా కట్ చేస్తున్నారని తెలిపారు. ఒక్కో బస్తాలో 41 కిలోల 500 గ్రాముల కాంటా పెడుతున్నారని, రైస్‌మిల్లుకు తరలించిన అనంతరం ఒక్కో లారీకి పది నుంచి 20 సంచుల వరకు కోత విధిస్తున్నారని రైతులు వివరించారు. వెంటనే జిల్లా సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడుతానని, తాను వచ్చాక వారితో మాట్లాడి న్యాయం చేసేలా కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు. దొడ్డు రకం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోళ్లను ముమ్మరం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తేమశాతం పేరిట రైతులను మోసం చేస్తున్న రైస్మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రే కాంటాలు ఏర్పాటు చేయించి అన్నదాతలకు అండగా నిలిచారు. స్పీకర్ తన వ్యక్తిగత సహాయకుడు భగవాన్‌రెడ్డితో కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిని, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాంటాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లు, రైస్‌మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. స్పీకర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగగా.. లారీలు రైస్‌మిల్లులకు పరుగులు పెడుతున్నాయి.