ఆర్మూర్‌టౌన్, అక్టోబర్ 6: మద్యం మత్తులో తన ఏడునెలల కొడుకును విక్రయించి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రితోపాటు నలుగురిపై కేసునమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నందిపేట మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి, పోశెట్టి దంపతులు. వీరు ఏడాదికాలంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు అఖిలేశ్ (ఏడు నెలలు) ఉన్నాడు.
మద్యానికి బానిసైన పోశెట్టి డ బ్బుల కోసం తన కొడుకు అఖిలేశ్‌ను అమ్మకానికి పెట్టాడు. పెర్కిట్‌కు చెందిన మధ్యవర్తి మహ్మద్ గౌస్ ద్వారా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీ నగర్‌కు చెందిన హబీబ్ ఖాన్‌కు రూ.30 వేలకు గత నెల 27న విక్రయించాడు. హబీబ్‌ఖాన్ బాలుడిని తీసుకొని నిర్మల్‌లో ఉంటున్న కూతురు రషీద వద్దకు వెళ్లాడు. ఆమెకు సంతానం లేకపోవడంతో అల్లుడు మహ్మద్‌కు బాలుడిని అప్పగించివచ్చాడు.
ఈ నెల 4వ తేదీన పోశెట్టి తాగిన మైకంలో డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి తన బాబును తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన నందిపేట్, ఆర్మూర్ పోలీసులు పోశెట్టిని విచారించగా బాలుడి విక్రయ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి విక్రయ వ్యవహారంలో నిందితులైన తండ్రితోపాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అఖిలేశ్‌ను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.