అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయనున్నది. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించింది. చేనేత బీమా పథకంలో ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన కార్మికులు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనున్నది. దీంతో కుటుంబ పెద్ద మరణిస్తే దిక్కుతోచని స్థితిలో ఉండే నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40 మగ్గాలు ఉండగా ఇందులో 31 మగ్గాలు పనిచేస్తున్నాయి. 31 మంది చేనేత కార్మికులతో పాటు వీరికి సహాయకులుగా ఉన్న మరో 16 మంది కలిపి మొత్తం 47 మందికి బీమా వర్తించనున్నది.
నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చేనేత వృత్తి దేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతున్న వేళ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. బతుకమ్మ చీరలతో రూ.కోట్లు విలువ చేసే ఆర్డర్లు కల్పించి ఉపాధికి ఢోకా లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా రాయితీతో యూనిట్ల స్థాపనకు తోడ్పాటును అందిస్తున్నారు. అయితే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రం చేనేత కుటుంబాల పొట్ట కొడుతు న్నది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసి, నేతన్నల వెన్ను విరిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్య కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తున్నది. చేనేత, జౌళి పరిశ్రమలపై 5శాతం ఉన్న జీఎస్టీని ఏకంగా రెట్టింపు చేయడంతో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిని కోలుకోలేని దెబ్బకొట్టారు. కేంద్ర నిరంకుశ విధానాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7ను పురస్కరించుకొని మరో పథకానికి శ్రీకారం చుట్టింది. రైతుబీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చేనేతను బతకనివ్వని నరేంద్ర మోదీ..
చేనేతకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వృత్తి, సేవారంగంగా చేనేతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత నెలకొన్నది. దానికి పరిశ్రమ హోదా ఇచ్చి రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని తెచ్చినప్పటికీ చేనేతకు, చిన్న జౌళి పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు కేంద్రంలోని బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగాయి. పైపెచ్చు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు సైతం అధికమవుతున్నాయి. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం చేనేత పరిశ్రమలను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు కదా వేధింపులు ఎక్కువయ్యాయి. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ పరుస్తున్న కేంద్రం.. చేనేత పరిశ్రమపై చిన్నచూపు చూస్తున్నది. జీఎస్టీని 12శాతానికి పెంచడంతో చేనేత, జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. చేతితో కళాత్మకంగా రూపొందించే చేనేత వస్ర్తాల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వాటి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. జీఎస్టీ భారంతో మరింత ప్రియం కావడంతో ఇక్కట్లు దాపురిస్తున్నాయి.
పైసా ఖర్చు లేకుండా…
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు బీమా పథకం ఈ నెల 7నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు(60 ఏండ్లలోపు), జియో ట్యాగ్ ఉన్న మగ్గం, మర మగ్గం నేసే కార్మికులు, వారికి అనుబంధంగా ఒక కార్మికుడు చొప్పున ఈ బీమా పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నేతన్నకు చేయూత అనే పేరుతో అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకంలో నమోదైన వారి వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చబడ్డాయి. బీమా పథకం కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. త్రిఫ్ట్ పథకంలో చేరిన వారికి బీమా పథకం ఎల్ఐసీ ద్వారా అమలవుతుంది. కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. చేనేత కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం పూర్తిగా చెల్లిస్తుంది. చేనేత బీమా పథకంలో అర్హులకు ఉచితంగా బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. అర్హులైన కార్మికులు అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనున్నది. దీంతో కుటుంబ పెద్ద మరణిస్తే దిక్కుతోచని స్థితిలో ఉండే నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది.
31 మగ్గాలు.. 47 మంది కార్మికులు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 47 మందికి చేనేత బీమా పథకం వర్తించనున్నది. అర్హులైన వీరంతా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. కామారెడ్డి జిల్లాలో మగ్గాలు లేకపోవడంతో అర్హులెవ్వరూ లేరని చేనేత శాఖ అదనపు సంచాలకుడు సంతోష్ వెల్లడించారు. ప్రస్తుతం 40 మగ్గాలకు గుర్తింపు ఉండగా ఇందులో 31 మగ్గాలు పని చేస్తున్నాయి. 31 మంది చేనేత కార్మికులతోపాటు వీరికి సహాయకులుగా ఉన్న మరో 16మందిని కలిపి మొత్తం 47 మందికి బీమా వర్తించబోతున్నది. జాతీయ చేనేత దినోత్సవం జరుపుకొనే ఆగస్టు 7న తేదీ నుంచి నేతన్నలకు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది. అన్నదాతలకు అందిస్తున్న రైతుబీమా తరహాలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రకటించడంతో చేనేత కుటుంబాల్లో సంబురం కనిపిస్తోంది. ప్రభుత్వ జియో ట్యాగ్ లెక్కల ప్రకారం ఇప్పటికే మగ్గాల వివరాలను క్రోడీకరించింది. జియో ట్యాగ్ కలిగిన వారికే నేతన్నకు చేయూత పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో ఒక్కో మగ్గానికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పేర్లు నమోదు చేసుకున్నారు. లబ్ధిదారుల జాబితాపై ఆయా జిల్లాల చేనేత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కార్మికుల్లో 60 ఏండ్లలోపు ఎంత మంది ఉన్నారో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
అర్బన్‌లో 22 మంది కార్మికులకు..
ఖలీల్‌వాడి, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. నిజామాబాద్ నగరంలోని చేనేత సహకార సంఘంలో మొత్తం 22 మంది పని చేస్తున్నారు. అందులో 20 మంది మహిళలు ఉండడం విశేషం. ఇద్దరు మాస్టర్లు ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ అర్బన్‌లో 20 మంది మహిళలు పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బీమాతో చేనేత కార్మికులకు ధీమా కల్పించారని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
చేనేత కార్మికులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకున్నది. అన్ని వస తులు కల్పిస్తూనే ప్రస్తుతం కార్మి కుల జీవితాలకు భరోసా కల్పించే విధంగా బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మా గురిం చి ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్.
– పుష్పలత, చేనేత కార్మికురాలు
సీఎంకు రుణపడి ఉంటాం..
డిచ్పల్లి, ఆగస్టు 2: నేతన్నకు బీమా పథకం వర్తింపచేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి పథకాలు తీసుకురావడం ఒక్క కేసీఆర్‌కే చెల్లుతుంది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-కారంపూడి లక్ష్మి, చేనేత కార్మికురాలు, జక్రాన్‌పల్లి
చాలా గొప్ప పథకం..
డిచ్పల్లి, ఆగస్టు 2: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు అమలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్ల తరహాలోనే నేతన్నకు బీమా పథకం దేశంలోనే అన్ని రాష్ర్టాలకెల్లా గొప్ప పథకం. ఇలాంటి పథకాలు తీసుకురావడానికి చాలా ధైర్యం కావాలి అది కేసీఆర్‌లో ఉంది.
– మాటేటి సత్యనారాయణ, చేనేత కార్మికుడు, జక్రాన్‌పల్లి
నేతన్నకు బీమాపై హర్షం..
కమ్మర్పల్లి, ఆగస్టు 2 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయనుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన చాలా మంది చేనేత కార్మికులకు తగిన ప్రోత్సాహం లేక మహారాష్ట్రలోని ముంబై, బీవండి నగరాలకు వెళ్లి అక్కడి నూలు మిల్లుల్లో పని చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ చేనేతకు చేయూతనిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించిన బీమా పథకంతో చేనేత కార్మికులు, కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక భద్రతనిస్తుంది..
కమ్మర్పల్లి, ఆగస్టు 2 : నేతన్నకు బీమా పథకం చేనేత కార్మికులకు ఆర్థిక భద్రతను ఇస్తుంది. నా సుదీర్ఘ వృత్తి కాలంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించిన పాలకులను చూడలేదు. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక భరోసాను అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు జరగకూడనిది జరిగితే పేద చేనేత కుటుంబాలకు తీరని ఆర్థిక భారం మిగులుతుంది. అలాంటి పరిస్థితిలో బీమా పథకం ఆ కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడుతుంది. ఈ పథకాన్ని అమలు చేయనున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-జోగు నరేందర్, చేనేత సహకార సంఘ సభ్యుడు, ముప్కాల్
ఎంతో మేలు జరుగుతుంది
సీఎం కేసీఆర్ ఇస్తున్న బీమాతో ఎంతో మేలు జరుగుతుంది. ఆరు నెలల క్రితం కార్మికుడు మరణిస్తే ఎలాంటి సహకారం అందలేదు. దీంతో చాలా బాధపడ్డాం. సీఎం కేసీఆర్ గుర్తించి బీమా సౌకర్యం కల్పించారు. తిఫ్ట్ కింద ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ. 1600 జమ అవుతున్నాయి. అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– రామకృష్ణ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, నిజామాబాద్
చాలా మంచి పథకం
సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆలోచిస్తారు. రైతుబీమాతో రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేలా బీమా తీసుకువచ్చారు. పద్మశాలీ కులస్తులు, చేనేత కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– సత్యపాల్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు
సీఎంతోనే అందరికీ న్యాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తున్నారు. చేనేత కార్మికుల బతుకులకు భరోసా కల్పించేలా బీమా పథకం తీసుకురావడం హర్షణీయం.
– సబ్బని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి
గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు
గత ప్రభుత్వాలు మా సమస్యలను పట్టించుకోలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాకు అన్ని వసతులు కల్పిస్తు న్నారు. ఇలాంటి చేతల ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సుజాత,కార్మికురాలు
ప్రభుత్వానికి వివరాలు పంపించాం..
నిజామాబాద్ జిల్లా పరిధిలో 47 మంది ప్రస్తుతం త్రిఫ్ట్ పథకంలో ఉన్నారు. వీరి వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. వీరిలో మగ్గాల యజమానులు 31 మంది కాగా మిగిలిన వారు వీరికి సహాయకులుగా ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బీమా వర్తింపు జరుగుతుంది. కామారెడ్డిలో పనిచేస్తున్న మగ్గాలు ఒక్కటీ లేదు.
– సంతోష్, అదనపు సంచాలకుడు, చేనేత, జౌళి శాఖ