నిజామాబాద్ రూరల్/ కమ్మర్పల్లి/ఏర్గట్ల/మాక్లూర్/ఆర్మూర్/రెంజల్/ కోటగిరి/మోస్రా (చందూర్), ఏప్రిల్ 21: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి.. వీచిన బలమైన ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రాత్రి పూట విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.జిల్లాలో 107 ఎకరాల్లో కూరగాయలు, మామిడి కాయలు దెబ్బతిన్నట్లు జిల్లా హార్టికల్చర్ అధికారి నర్సింగ్‌దాస్ వెల్లడించారు. ఉద్యానవన శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. బాల్కొండ మండలంలో 10 ఎకరాలు, ముప్కాల్‌లో 12, మెండోరాలో 16, ఏర్గట్లలో 4, మాక్లూర్‌లో 25, నందిపేట్‌లో 20, భీమ్‌గల్‌లో 10, కమ్మర్పల్లి 10 ఎకరాల్లో కూరగాయలతో పాటు మామిడి కాయలు దెబ్బతిన్నట్లు వివరించారు.
కమ్మర్పల్లి మండలంలో వర్షంతో పాటు గంట పాటు బలమైన గాలులు వీచాయి. మామిడి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో నువ్వు, సజ్జ పంటలు నేలవాలాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసింది. రోడ్లపై చెట్లు నేలకొరిగాయి.
మాక్లూర్, మాదాపూర్, మదన్‌పల్లి, గంగరమంద తదితర గ్రామాల్లో ఈదురుగాలులు, అకాల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. మామిడి తోటలను ఏవో పద్మ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుక భాగంలో, ఆలూర్ బైపాస్ రోడ్డు, ఇస్సాపల్లి, పిప్రి, పెర్కిట్ గ్రామాల్లో రోడ్లపై అరబెట్టిన ధాన్యం తడిసింది.
రెంజల్ మండలంలో తడిసిన ధాన్యం కుప్పలను నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్, వైస్ ఎంపీపీ యోగేశ్, మాజీ ఉపసర్పంచ్ సుభాష్ పరిశీలించారు.
పొతంగల్ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మోస్రా మండలంలోని గోవూర్‌లో కళ్లాల వద్ద తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ సాయిలు, జడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నరేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.