Mala Sangam | కోటగిరి ఆగస్టు : విద్యా, ఉద్యోగ రంగంలో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా ఉద్యోగ రంగంలో సమాన రిజర్వేషన్ కల్పించాలని మాల సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం చిన్న సాయన్న డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని నిరసిస్తూ కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు చిన్న సాయన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాల మాదిగలకు కలిపి 15శాతం రిజర్వేషన్ కల్పించిందని కానీ ఇందులో మాలలకు కేవలం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి, విద్యా ఉద్యోగ రంగంలో రోస్టర్ పాయింట్ అమలు చేసి మాల కులస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని రద్దు చేసి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగ రంగంలో సమాన రిజర్వేషన్ కల్పించాలన్నారు.
లేని యెడల మాల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం మండల అధ్యక్షులు దండు భూమేష్, డివిజన్ కార్యవర్గ సభ్యులు పుప్పల సైదయ్య, రాములు, పాల గంగారం కాలె సాయిలు,మారుతి, లక్ష్మణ్, గంగారం కిషన్, విఠల్ తదితరులు ఉన్నారు.