మోర్తాడ్, మార్చి 23: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతున్నది. కొన్నిరోజులుగా గ్రూపు రాజకీయాలు కొనసాగుతుండగా..తాజాగా సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇసుక దందాతోపాటు తన అనుచరులకే అనుమతులు ఇప్పిస్తున్నట్లు కొన్నిరోజులుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాపారాలపై ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు వెలుగుచూశాయి. దీనిపై సునీల్ వర్గీయులు ఆరా తీయగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది బడాభీమ్‌గల్‌కు చెందిన వారని గుర్తించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సునీల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి బడాభీమ్‌గల్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు ఈరవత్రి అనిల్‌కుమార్ వర్గీయులుగా గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు భీమ్‌గల్ ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. ముగ్గురిని విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు పిలిపించినట్లు పేర్కొన్నారు. ముగ్గురి అరెస్టు నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన చాలా మంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సునీల్‌రెడ్డి, అనిల్ వర్గాల మధ్య సోషల్‌మీడియాలో వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది.