బాన్సువాడ, మే 28: బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలో ఏనుగు రవీందర్‌రెడ్డి ఫొటో పెట్టకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని బాన్సువాడలోని ఓ ప్రైవేటు గార్డెన్లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అబ్జర్వర్లు వేణుగోపాల్ యాదవ్, సత్యనారాయణగౌడ్ హాజరయ్యారు.
సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదని ఆయన వర్గీయులు నిరసన వ్యక్తంచేశారు. ఆయనను సమావేశానికి ఎందుకు పిలువలేదని ధ్వజమెత్తారు. ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారిని కాదని, ఇటీవల పార్టీలో చేరిన వారి ఫొటోలు పెట్టారని సమావేశం జరుగుతున్న గార్డెన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ గెలుపు కోసం తమ నాయకుడు రవీందర్‌రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారని, నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ వచ్చేలా చూశారన్నారు.
కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తల బాధ తమకు తెలుసని జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తెలిపాడు. రవీందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూర్చొని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఇకపై నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరిగినా.. మీకు తప్పకుండా సమాచారం ఉంటుందని, కలిసి పనిచేయాలని సూచించడంతో ఏనుగు వర్గీయులు నిరసన విరమించారు.