బోధన్, అక్టోబర్ 17: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు జిల్లాలో గురువారం కొనసాగాయి. ఇందులో భాగంగా బోధన్‌లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల కరెస్పాండెంట్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, పలువురు విద్యావేత్తలతో కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు మాట్లాడుతూ.. డస్టర్, సుద్దముక్కతో విద్యాబోధన చేసే తాము రోడ్లపైకి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లడానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో అధ్యాపకులకు సైతం వేతనాలు అందించని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ వికాస్మహతోకు అందజేశారు. వివిధ ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.