ఆర్మూర్టౌన్, మే 19: ఇటుక బట్టీల్లో కొంతకాలంగా నిర్బంధంగా వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులకు జిల్లా జడ్జి భరతలక్ష్మి విముక్తి కల్పించారు. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వుల మేరకు ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్, దేగాం గ్రామాల్లో ఉన్న ఇటుకబట్టీలపై ఆర్మూర్ పోలీసులు, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయా, ఆర్మూర్ జడ్జి శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి దాడులు చేశారు. ఇటుక బట్టీల్లో కార్మికుల దీనస్థితిని చూసి చలించిపోయారు. కార్మికులను ఒక్కొక్కరుగా పిలిపించి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.
రోజువారీ పని చేయని కార్మికులను రూముల్లో బంధించి మహిళలను చితకబాదారని న్యాయమూర్తి దృష్టికి కార్మికులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కార్మికులను పని చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో ఉన్నదని తెలిపారు. ఇటుక బట్టి కార్మికులకు కనీస వసతులు కల్పించకపోవడం, కనీస వేతనాలు చెల్లించకపోవడం, కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం, లేబర్ చట్టాలను పాటించడంలేదని ఇటుక బట్టీలో పని చేస్తున్న బాబు అనే కార్మికుడు హైదరబాద్ లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారని తెలిపారు.
లేబర్ రికార్డు లేకపోవడం, కనీస వసతులు కల్పించకుండా పని చేయించడం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా ఇటుక బట్టీ కార్మికులకు కనీస వసతులు లేవన్నారు. రెవెన్యూశాఖతో మాట్లాడి సదుపాయాలతోపాటు వారికి రావాల్సిన నష్ట పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. కార్మికులను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, ఇటుక బట్టీలను సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బందీగా ఉన్న కొడుకు అరగంటలో తల్లిదండ్రుల చెంతకు..
మగ్గిడి గ్రామంలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న చానానమ్మ, లక్ష్మయ్య కన్నీరు పెడుతూ తమ కొడుకు శ్రీను (13) దేగాం గ్రామంలోని ఇట్టుక బట్టీలో బందీగా ఉన్నాడని జిల్లా జడ్జి భరత లక్ష్మికి చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన జిల్లా న్యాయమూర్తి సంబంధిత అధికారులకు సమాచారం అందించి 30 నిమిషాల్లోనే కొడుకును తల్లిదండ్రులకు అప్పగించారు.