నిజామాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబే ద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఘనం గా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. అంబేద్కర్‌కు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడంతో పాటు ఆయన మనవడితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ప్రారంభించడం ద్వారా యావత్ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రజలు తరలి వెళ్లారు. దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, యువజన సంఘాల బాధ్యులంతా చలో హైదరాబాద్ పేరిట పయనమై చారిత్రాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అట్టడుగు ప్రజలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన ప్రకటన చేయడం ద్వారా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ప్రతి ఏటా అంబేద్కర్ పుట్టిన రోజున అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా అంతటా సంతోషం వెల్లివిరుస్తోంది. దళిత సమాజం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేసీఆర్‌పై అభిమానంతో ప్రజలంతా జై భీమ్… జై కేసీఆర్… అంటూ నినదిస్తుండడం ప్రత్యేకతను చాటుకుంటున్నది.
5వేల మంది పయనం…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున హైదరాబాద్‌కు పయనమయ్యారు. భారీ అంబేద్కర్ విగ్ర హం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగమే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహనాలను సమకూర్చడంతో పాటు భోజన వసతి కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 5వేల మంది వరకు ప్రజలు పయనం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక వాహనాలను ఆయా మండలాల్లో ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. చాలా మంది దళిత సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల లీడర్లు, ప్రజా ప్రతినిధులు సైతం సొంత వాహనాల్లోనూ భాగ్యనగరానికి వెళ్లారు. నెక్లెస్ రోడ్డులో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని చూసి జనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశానికి ఆయువుపట్టుగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని లిఖించిన అంబేద్కర్‌కు కేంద్ర ప్రభు త్వం కన్నా మిన్నగా రాష్ట్రప్రభుత్వం గౌరవించింద న్న ప్రశంసలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అంబేద్కర్ బాటలో కేసీఆర్…
దేశ ప్రజలందరికీ అంబేద్కర్ మార్గనిర్దేశకుడు. ఆయన భారతదేశానికే భారతరత్న. దళితుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాటం చేయడానికి ముందు వరకూ దళితుల పరిస్థితి దయనీంగా ఉండేది. వారు ఊరికి దూరంగా నివసించే వారు. అలాంటి వారు నేడు సమాజంలో మనుషులుగా గుర్తింపు పొందుతున్నారన్నా… ఆర్థిక స్వావలంబన సాధించారన్నా… రాజకీయాల్లో ఉనికి చాటుతున్నారన్నా… వాటన్నింటికీ కర్త, కర్మ, క్రియ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయన ఆధునిక భారతదేశ చరిత్ర మీద చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుని పేరును నూతన పార్లమెంట్ భవనానికి పెట్టి భారత దేశ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అమానవీయ పరిస్థితులు రాజ్యమేలుతున్న కాలంలో కూడా ఒక దళిత కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఉన్నత చదువుల సాయంతో స్వయం కృషితో పైకి ఎదగవచ్చని నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుకు రావడం లేదు. ప్రజల డిమాండ్‌ను అంగీకరించేందుకు ప్రకటన కూడా చేయడం లేదు. కానీ రాష్ట్రంలో మా త్రం కేసీఆర్ సర్కారు ఏకంగా తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టి గౌరవించారు. అంతటితో ఆగకుండా 125వ జయంతి నాడు చెప్పినట్లుగానే 125 అడుగుల భారీ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసి కేసీఆర్ సత్తా చాటారు.
దేశ వ్యాప్తంగా దళిత సమాజం ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచంలో మరెక్కడా ఇంతటి భారీ అంబేద్కర్ విగ్రహం లేదన్నట్లుగా నెలకొల్పారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అడుగడుగు నా అంబేద్కర్ బాటలోనే నడుస్తున్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది…
రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ జయంతిని కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు, 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు, దళితబంధు పథకం, తాజాగా అంబేద్కర్ పేరుతో అవార్డు ఇవ్వనున్నట్లుగా కేసీఆర్ చెప్పడం చారిత్రాత్మకం. దళిత సమాజం అభ్యున్నతి కోసం దేశంలో మరెవ్వరూ పాటుపడని విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచిస్తున్న ఏకైక లీడర్ కేసీఆర్ మాత్రమేనని చెప్పుకోక తప్పదు.
– హన్మంత్ షిండే, జుక్కల్ ఎమ్మెల్యే
రాష్ర్టానికే తలమానికం…
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదీ సచివాలయానికి పక్కనే హైదరాబాద్‌కు తలమానికంగా ఉండే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారు. హ్యాట్సాఫ్ టు కేసీఆర్. దేశాన్ని, రాష్ర్టాన్ని గతంలో ఎంతో మంది పాలించారు. ఎవరికీ రాని ఆలోచన కేసీఆర్‌కు రావడం గొప్ప విషయం.
– దయానంద్, ఉద్యోగ సంఘాల నేత
గర్వంగా ఉంది…
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా గర్వంగా ఉంది. సాదాసీదాగా కాకుండా అత్యద్భుతంగా విగ్రహాన్ని నెలకొల్పడం గొప్ప విషయం. రాబోవు రోజుల్లో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు అంబేద్కర్ విగ్రహమే ల్యాండ్‌మార్క్‌గా నిలువబోతుంది.
-పులి జైపాల్, ఉద్యమకారుడు