బాన్సువాడ రూరల్, జూన్ 15 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొల్లూరు గ్రామంలో గురువారం ‘పల్లె ప్రగతి దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్.. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.60లక్షలతో నిర్మించిన ఆరు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాల్లో ఎక్కడా చూసినా పచ్చదనం, పరిశుభ్రత కనబడుతున్నదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
మౌలిక వసతుల కోసం గత ప్రభుత్వం రూ. 12వేల కోట్లు ఖర్చు చేస్తే ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 58 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్, నీటి సరఫరా కోసం ట్యాంకర్‌ను అందించామని చెప్పారు. రాష్ట్రంలో 45లక్షల మందికి ఆసరా పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పింఛన్ రూ. 400 నుంచి రూ. వెయ్యి వరకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లోని అడిగిన అన్ని పనులకు నిధులు మంజూరు చేశానని చెప్పారు. నియోజకవర్గంలో 100 కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
ఇంటింటికీ తాగు నీరు.. గుంట గుంటకూ సాగునీరు
ఇంటింటికీ తాగు నీరు, గుంట గుంటకూ సాగు నీరు అందించమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ అన్నారు. ఇంటింటి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా రూ. 36వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత భూ ములకు సాగునీరు అం దించడానికి రూ. 200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ. 150 కోట్లతో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాగారం గ్రామంలో రూ. 20లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవనం, రూ. 5లక్షలతో చేపట్టనున్న ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. పల్లె ప్రగతి దినోత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో సభాపతి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు తుకారాం, రాచప్ప, ఎంపీపీ దొడ్ల నీరజారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ సమత, డీఎస్పీ జగన్నాథరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి. ఎంఈవో నాగేశ్వర్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పల్లెల్లో ప్రగతి సంబురం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.