Balkonda MLA Vemula Prashanth Reddy | చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29.. బాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
దశాబ్దాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకునేందుకు తొలి అడుగు పడిన చారిత్రక దినం నవంబర్ 29 అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
- కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ కల సాకారం
- మృత్యువుకు ఎదురెళ్లి స్వరాష్ట్రం సాధించిన ఏకైక నాయకుడు కేసీఆర్
- నాడు పదవులకు రాజీనామా చేయని రేవంత్, కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
- కేసీఆర్ హయాంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ, నేడు మళ్లీ కరెంటు, సాగునీటి కష్టాలు
- సన్న వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం.. తక్షణమే కాంటాలు తెరిచి రైతులను ఆదుకోవాలి
- పసుపు బోర్డు పేరుతో ఎంపీ అర్వింద్ దగా.. రూ.15 వేల మద్దతు ధర ఏమైందని ప్రశ్న
Balkonda MLA Vemula Prashanth Reddy | బాల్కొండ : దశాబ్దాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకునేందుకు తొలి అడుగు పడిన చారిత్రక దినం నవంబర్ 29 అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 2001 నుండి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలకు ఆయన ఉద్యమ వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమైక్య పాలనలో తెలంగాణ పడిన కష్టాలు, కేసీఆర్ చారిత్రక దీక్ష, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగినప్పటికీ, నాయకుడే స్వయంగా చావు నోట్లో తలపెట్టి మృత్యువుకు ఎదురెళ్లి విజయం సాధించిన ఏకైక ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమమేనని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా నిషేధం ఉండేదని, రైతులకు సాగునీరు, కరెంటు లేక, యువతకు ఉపాధి లేక వలసలు వెళ్లే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు.
ఈ కష్టాలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని భావించిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీడీపీలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే వంటి అత్యున్నత పదవులను త్యాగం చేసి టీఆర్ఎస్ ని స్థాపించారని గుర్తు చేశారు. కుల, ధన బలం లేకపోయినా కేవలం న్యాయం, ధర్మం అనే ఆయుధాలతో నాటి బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొని, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారని కొనియాడారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని విమర్శించారు. నాడు కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ కోసం తన షిప్పింగ్ మంత్రిత్వ శాఖను త్యాగం చేయడమే కాకుండా, 32 రాజకీయ పార్టీల మద్దతు లేఖలు సేకరించి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు అందించారని తెలిపారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి రెండున్నరేళ్లలోనే కేంద్ర మంత్రి పదవికి, ఆ తర్వాత రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా రాజకీయ అనివార్యత సృష్టించారని చెప్పారు. 14F నిబంధనపై పోరాడుతూ 2009 నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని, ఖమ్మం జైలు, నిమ్స్ ఆసుపత్రిలో 12 రోజుల పాటు అన్నపానీయాలు ముట్టకుండా దీక్ష చేయడంతో కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి నైతిక హక్కు లేదు
తెలంగాణ సమాజం పిలుపునిచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారని, కానీ నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదవులకు రాజీనామా చేయని ద్రోహులని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నాడు నిజామాబాద్‌లో రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణపై పోటీ పెట్టకుండా కేసీఆర్ గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తాత్సారం వల్లే శ్రీకాంతాచారి సహా వందలాది మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు సోనియా గాంధీని ‘బలిదేవత’ అని దూషించిన రేవంత్ రెడ్డి, నేడు ఆమెను దేవత అంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరుడు శ్రీకాంతాచారి పేరును ఉచ్చరించే నైతిక అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.
కేసీఆర్ హయాంలో అగ్రగామిగా తెలంగాణ-నేడు మళ్లీ పాత కష్టాలు
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, 24 గంటల ఉచిత కరెంటు మరియు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేసి రైతును రాజుగా చేశారని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో మళ్లీ ఆరేడు గంటల కరెంటు, యూరియా కోసం క్యూలైన్లు, ఎండిపోతున్న చెరువులు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. సన్న వడ్లు వేయాలని ప్రోత్సహించిన ప్రభుత్వం, తీరా పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాలు (కాంటాలు) తెరవకుండా మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోందని ఆరోపించారు. రూ.3,500 పలికిన సన్న వడ్ల ధరను వ్యాపారులు రూ.2,650కి పడేశారని, తక్షణమే ప్రభుత్వం కాంటాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు పక్షాన ప్రశ్నిస్తున్నందుకు తన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పసుపు బోర్డు పేరుతో ఎంపీ అర్వింద్ దగా, హద్దు మీరితే తీవ్ర పరిణామాలు
2019లో అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి క్వింటాల్ పసుపుకు రూ. 15,000 మద్దతు ధర ఇప్పిస్తానని హామీ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఆరేళ్ల తర్వాత ఎలాంటి అధికారాలు లేని డమ్మీ బోర్డును ఏర్పాటు చేసి రైతులను మోసం చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2019తో పోలిస్తే సాగు ఖర్చులు, కూలీలు, ఎరువులు, విత్తనాల ధరలు మూడు రెట్లు పెరిగాయని, ఆ లెక్కన నేడు రైతులకు పసుపు కనీస మద్ధతు ధర రూ.30వేల మద్దతు ధర రావాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద పంట ఉన్న ఫిబ్రవరి-మార్చి నెలల్లో ధర రూ.8 వేలు, రూ.10 వేలకు పడిపోయి, సరుకు దళారుల చేతికి వెళ్లాకే ధర రూ.12 నుండి రూ.15 వేలకు పెరుగుతోందని గణాంకాలతో సహా వివరించారు. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అక్కడి రైతులకు రూ. 50 వేల ధర ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనపు నిధులు, నవోదయ పాఠశాలలు, ఐఐఎం లేదా ప్రాజెక్టులకు నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ అర్వింద్ తన తండ్రి వయసున్న కేసీఆర్ పై అగౌరవంగా, ఇష్టానుసారంగా మాట్లాడితే ఇకపై బీఆర్ఎస్ కార్యకర్తల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఉద్యమ చరిత్రను ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలి
తెలంగాణ సాధనలో తమ పాత్ర లేకపోయినా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 2001 నుండి తెలంగాణ సమాజం పడిన కష్టాలు, అమరుల త్యాగాలు మరియు కేసీఆర్ చారిత్రక పోరాటాన్ని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

