నిజామాబాద్, అక్టోబర్ 31, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి కాని మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి అమాత్యయోగాన్ని ఆకాంక్షించి అడుగడుగునా నిరాశకు గురైన సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవితో కాంగ్రెస్ పార్టీ చల్లబర్చింది. దాదాపుగా రెండేళ్లుగా మంత్రి పదవి తనకే వస్తుందనే ప్రచారం చేసుకుని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక సందర్భాల్లో పెద్దన్న పాత్రను బోధన్ ఎమ్మెల్యే పోషించారు. ఉభయ జిల్లాల్లో కలియ తిరుగుతూ కలెక్టర్లకు సలహాలు, సూచనలు అందించారు. మంత్రి కాని మంత్రిగా చలామణి అయ్యారు.
కొంత కాలానికి తాను అనుకున్న మంత్రి పదవి రాకపోవడంతో నిరాశకు గురై కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. క్రికెటర్ అజారొద్దీన్కు మంత్రి పదవిని ఏఐసీసీ కట్టబెట్టగా మరోసారి విస్తరణలో సుదర్శన్ రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. దీంతో ఏదో ఒక పదవిని ఇచ్చి సంతృప్తి పర్చాలని కాంగ్రెస్ పార్టీ యోచించింది. అందులో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకై ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే అన్ని క్యాబినెట్ మీటింగ్లకు సుదర్శన్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా గుర్తిస్తూ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
పేరుకు ప్రభుత్వ సలహాదారు పదవి అయినప్పటికీ సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలపై పట్టు సాధించేలా, నియంత్రణ చేసే విధంగా ప్రభుత్వ సలహాదారు పదవిని తీర్చిదిద్దారు. ఆరు గ్యారంటీల అమలును బాధ్యతను పర్యవేక్షించడంతో పాటుగా సంక్షేమ, అభివృద్ధి పనులపై అన్ని శాఖల్లో స్వీయ సమీక్షలు చేసే విధంగా అధికారాలు అప్పగించారు. క్యాబినెట్ మంత్రితో సమానంగా వసతి, భద్రత, ఇతర సౌకర్యాలను కల్పిస్తూ జీవోను జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రుల ఛాంబర్లకు పక్కనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంత్రుల నివాస సముదాయంలో ప్రత్యేకంగా వసతి సౌకర్యాన్ని అందిస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
క్యాబినెట్ మీటింగ్లకు ప్రత్యేక ఆహ్వానితుడిగానూ సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇలా మంత్రి కాని మంత్రిగా ఉమ్మడి జిల్లాలో కొనసాగిన బోధన్ ఎమ్మెల్యేకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కాని మంత్రి హోదాలో తిరిగే విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కేవలం అమాత్య యోగం తప్పితే మిగిలిన అధికారాలు అన్నీ కట్టబెట్టింది. రాజ్భవన్లో గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం మినహా అన్ని రకాలుగా పీఎస్సార్కు రేవంత్ రెడ్డి పెద్ద పీట వేశారు. తన కంటే జూనియర్లకు పార్టీతో సంబంధం లేని వారికి మంత్రి పదవులు ఇవ్వడం, అర్హతలున్నప్పటికీ తనను పక్కన పెట్టడంపై మొదట్నుంచి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సుదర్శన్ రెడ్డి ఇకపై చురుగ్గా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొత్తం మూడు ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కినైట్లెంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా రేవంత్ రెడ్డి నియమించారు. మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన షబ్బీర్ అలీ గత రెండేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సైతం ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యేకు ఈ పదవి దక్కింది. ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డిలున్నప్పటికీ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి మాత్రం ఎవ్వరికీ లేకపోవడం విడ్డూరంగా మారింది. ఈ ముగ్గురు నేతలు గడిచిన 1999 నుంచి 2023 వరకు రెండున్నర దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పని చేసిన వారే. ఆయా సందర్భాల్లో కీలకంగా వ్యవహరించి ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా నిలిచిన వారే కావడం ఆసక్తిగా మారింది. మంత్రి వర్గ విస్తరణ సంపూర్ణంగా కాకపోవడంతో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త ఎమ్మెల్యేలకు అమాత్యయోగం దక్కుతుందేమో? అన్న ఆలోచన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.