భీమ్‌గల్, నవంబర్ 27 ;ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) ద్వారా నిరుపేద కుటుంబాల్లో అర్హులైన యువతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. భీమ్‌గల్ మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో సెంటర్ ఏర్పాటైంది. ఈ కేంద్రం ద్వారా సుమారు వెయ్యి మంది యువతీయువకులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వారికి స్వయం ఉపాధి, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరేందుకు మార్గం సుగమమైంది.
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపల్, చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువత పాలిట వరంలా మారింది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్). రాష్ట్ర మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో 2019 అక్టోబర్ 25న భీమ్‌గల్‌లో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఎలక్ట్రికల్, టైలరింగ్, మేషన్, ప్లంబర్, పెయింటింగ్ తదితర రంగాల్లో యువతీయువకులు శిక్షణ పొందుతున్నారు. మహిళలకు మూడు నెలల టైలరింగ్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థ నుంచి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నారు. టైలరింగ్ విభాగంలో ఎస్సీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఇప్పటి వరకు 155 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. మూడు నెలల ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో ఇప్పటి వరకు 356 మంది యువకులు శిక్షణ పూర్తి చేసుకోగా, వారందరికీ ఉపాధి లభించింది. కొందరు యువకులు స్వయం ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ కార్డు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు 15రోజుల సర్టిఫికెట్ కోర్సును అందిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు 500 మంది శిక్షణ తీసుకున్నారు.
జిల్లాలో రెండు కేంద్రాలు..
నిజామాబాద్ జిల్లాలో న్యాక్ శిక్షణా కేంద్రాలు రెండు ఉన్నాయి. మంత్రి వేముల చొరవతో భీమ్‌గల్ మండల కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేశాం. ఎలక్ట్రికల్, టైలరింగ్, మేషన్, ప్లంబర్, పెయింటింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాం. టైలరింగ్‌లో 155 మందికి శిక్షణ పూర్తయ్యింది. వారికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కుట్టు మిషన్లను అందజేశారు. న్యాక్ ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
– సీహెచ్. ప్రభాకర్, అసిస్టెంట్ డైరెక్టర్, న్యాక్
ఉపాధి అవకాశాలు బాగుంటాయి..
భీమ్‌గల్ న్యాక్ సెంటర్ ద్వారా మండలానికి చెందిన యువతీయువకులకు ఎలక్ట్రికల్, టైలరింగ్, మేషన్, ప్లంబర్, పెయింటింగ్ విభాగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
– దిలీప్గౌడ్, న్యాక్ సెంటర్ ఇన్చార్జి
సొంతగా బట్టలు కుడుతున్నా…
న్యాక్ కేంద్రంలో టైలరింగ్ శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం నేను ఇంటి వద్ద బట్టలు కుడుతూ ఆదాయాన్ని పొందుతున్నాను. బయట టైలరింగ్ నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. బయటి కన్నా న్యాక్ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు కుట్టు మిషన్‌ను కూడా అందజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
– భార్గవి, భీమ్‌గల్
నిరంతర ప్రవేశం..
న్యాక్‌లో అడ్మిషన్లు పొందడానికి తేదీ, గడువు తేదీ అని ఏమీ లేదు. అభ్యర్థులు వస్తుంటారు.. శిక్షణ పొందుతారు పోతుంటారు. గరిష్ఠంగా 40 మంది, కనిష్ఠంగా 30 మందితో బ్యాచ్ రెడీ అవ్వడమే ఆలస్యం.. శిక్షణను ప్రారంభిస్తారు. 80శాతం ప్రాక్టికల్స్, 20శాతం బోధనకు కేటాయిస్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరుతో వర్కింగ్ సైట్లలోనే వీరికి శిక్షణ ఇస్తుంటారు. దీంతో నిజ జీవితంలో వృత్తిపరంగా ఎదురయే సమస్యలను ఎదుర్కోవడానికి వీలవుతుంది. శిక్షణ కాలంలో పెన్నులు, పెన్సిల్, నోట్‌బుక్స్, యూనిఫాం, షూ, హెల్మెట్, ఆఫ్రాన్, వసతి, భోజనాన్ని న్యాక్ సమకూరుస్తున్నది.
కావాల్సిన పత్రాలు..