పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా, పొతంగల్ మండలాలు కొత్తగా పురుడు పోసుకున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలంలో మంగళవారం అధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించనుండగా, స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి హాజరుకానున్నారు. నూతన మండలం సరికొత్త ప్రస్థానం మొదలుకానున్న వేళ.. ఆలూర్ మండల పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా, పోతంగల్ మండలాలు కొత్తగా పురుడు పోసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవోను సైతం జారీ చేయగా యంత్రాంగం విభజన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలంలో మంగళవారం అధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలు షురూ కానున్నాయి. స్థానిక ఎమ్మె ల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా నూతన మండలం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
సెప్టెంబర్ 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 103ను అనుసరించి కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. పరిపాలన, భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడంతోపాటు ఆర్మూర్, మాక్లూర్ మండలాల నుంచి గ్రామాలకు సంబంధించిన పూర్తి రికార్డులను ఆలూర్ మండల కార్యాలయాలకు తరలించారు. దీంతో నూతన మండలం సేవలను అందించేందుకు సిద్ధమైంది. చాలా ఏండ్లుగా ఈ ప్రాంతవాసులు మండల కేంద్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవ, సీఎం కేసీఆర్ నిర్ణయంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నూతన మండలం సరికొత్త ప్రస్థానం మొదలుకానున్న వేళ.. పాత మండలాల నుంచి వేరు పడిన గ్రామాల్లోని ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు.
ప్రజల ఆశయాలు, కోరికలను నెరవేర్చడంలో బీఆర్ఎస్గా మారబోతున్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. గతంలో ఏదేని సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలకు నెలల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. చెప్పులరిగేలా తిరిగినా నెరవేరేది కాదు. ఇప్పుడు ప్రజల వినతుల మేరకు క్షేత్ర స్థాయి అధ్యయనం చేయడం, తదనంతరం పక్కాగా పనులు పూర్తి చేయడం జరిగిపోతున్నది. ఇందుకు నూతన మండలాల ఏర్పాటే తార్కాణం. 2016, అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన సమయంలోనే ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత అక్కడక్కడ ప్రజల నుంచి మండలాల ఏర్పాటుపై వినతులు వచ్చాయి. ఈ అంశంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ తదనుణంగా సమయానుసారంగా నిర్ణయాన్ని వెలువరించారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలు, కామారెడ్డిలో ఒకటి చొప్పున ఏర్పాటు అయ్యాయి. ఆలూర్ మండలంలో ఆలూర్, మిర్దాపల్లి, దేగాం, మచ్చర్ల, గగ్గుపల్లి, కల్లెడి, గుప్తా గ్రామాలు ఉన్నాయి. ఇందులో కల్లెడి, గుప్తా గ్రామ పంచాయతీలు మాక్లూర్ మండలం నుంచి మిగిలినవి ఆర్మూ ర్ మండలం ద్వారా ఆలూర్ మండలంలో కలిపారు. డొంకేశ్వర్ మండలంలో డొంకేశ్వర్, తొండాకూర్, దత్తాపూర్, గంగసముందర్, సిర్పూర్, అన్నారం, మారంపల్లి, నూత్పల్లి, నార్కోద్ (జీజీ నడ్కుడ), గాదెపల్లి, కోమట్‌పల్లి, నికాల్పూర్ ఉన్నాయి.
ఆర్మూర్ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పసుపు, మక్కజొన్న, కూరగాయల సాగుతో ఈ ప్రాంతం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్మూర్‌లో మొన్నటి వరకు మూడు మండలాలు మాత్రమే ఉండేవి. ఆర్మూర్, నందిపేట, మాక్లూర్ నుంచి ఆలూర్, డొంకేశ్వర్ మండలాలుగా ఏర్పడడంతో మండలాల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా ఏర్పడిన ఆలూర్ మండలం పక్కా వ్యవసాయ ప్రాంతంగా పేరు గాంచింది.
నందిపేట మండల కేంద్రం గతం నుంచి అభివృద్ధి పథంలో దూసుకుపోవడం తో కాసింత పట్టణీకరణ ప్రభావానికి లోనైంది. ఆర్మూర్ మండల కేంద్రం మున్సిపాలిటీగా సరికొత్త పంథాలో సాగుతోంది. మాక్లూర్ మండల కేంద్రం ఏకంగా జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉండడంతో నగరీకరణ ప్రభావంలో వృద్ధి చెందుతోంది. రెండు మండలాల్లోని గ్రామాల కలయికతో ఏర్పడిన ఆలూర్ మండలం పూర్తిగా పల్లె వాతావరణంతో కనిపించబోతోంది. వ్యవసాయక మండలంగానూ గుర్తింపు తెచ్చుకోనున్నది.
ఆలూర్ మండలం కావాలన్నది ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల ప్రజలు చాలా రోజుల నుంచి కోరుతున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రజల కోరిక నెరవేరింది. ఆర్మూర్ నియోజకవర్గంలో మూడు మండలాలు కాస్తా 5 మండలాలకు చేరాయి. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయికి సులువుగా చేరడానికి కొత్త మండలాలు దోహదం చేస్తాయి. ప్రజల చిరకాల కోరిక తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నూతన మండలం ద్వారా ప్రభుత్వ సేవలను దక్కించుకోబోతున్న ప్రజంలదరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
మాక్లూర్: నూతన మండలాల ఏర్పాటుతో కేసీఆర్ పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో మండలాల వ్యవస్థ ఏర్పాటైనా గ్రా మాలు ఎక్కువగా ఉండేవి. దీంతో అ భివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందేవి కాదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కొత్త మండలాలు ఏర్పాటు చేసి, పుష్కలంగా నిధులిస్తున్నారు. ఆలూర్‌ను మండలంగా ఏర్పా టు చేసినందుకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
-బడుగు అంజన్‌కుమార్, డీకంపల్లి
ప్రజల వద్దకు పాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నూతన మండలాలను ఏర్పా టు చేయడం అభినందనీయం. దీంతో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఉంటుంది. పాలనా వ్యవస్థ సజావుగా జరుగుతుంది. జవాబుదారితనం మెరుగుపడుతుంది. తక్కువ గ్రామాలు ఉండడంతో మండలం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఆలూర్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-సీబీ సురేశ్, గుత్ప