కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారు. నియంత్రణ లేని ధరలతో సతమతమవుతున్నారు. మోదీ సర్కారు వైఫల్యంతో ద్రవ్యోల్బణం అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తున్నది. అంచనాలను తారుమారు చేస్తూ ఆర్థిక వృద్ధి రేటు నేలచూపులు చూస్తున్నది. ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై ధరల మోత మోగిస్తూనే ఉన్నది. పాలు, పెరుగు నుంచి మొదలుకుని అన్నింటిపైనా జీఎస్టీ విధిస్తూ చావబాదుతున్నది. ఇక, తెలంగాణపై అంతులేని వివక్షను చూపిస్తూ నిధులు విడుదల చేయకుండా సతాయిస్తున్నది. ఇలాంటి తరుణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మెచ్చుకోవాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఆరోపణలు చేయడంపై ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజలు మండి పడుతున్నారు. ముందుగా కేంద్ర తప్పుడు విధాన నిర్ణయాలతోపాటు రాష్ట్రంపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక వృద్ధి రేటు పతనమవుతున్నది. అన్నింటి ధరలు పెంచేసిన మోదీ సర్కారు జనాలను చావబాదుతున్నది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు వైఫల్యం పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా పరిణమించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మానవత్వం చూపకుండా అన్నింటిపైనా జీఎస్టీ విధిస్తూ బతుకును భారం చేస్తున్నారు. పేదల సంక్షేమం మరిచిన కేంద్ర విత్త మంత్రి కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు తామేం చేసిందో చెప్పకుండా అబద్ధాలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయకుండా వివక్షపూరిత కుట్రలకు పాల్పడుతూ నీతి వ్యాఖ్యలు వల్లె వేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.

వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం నవ్వుల పాలైంది. బ్యాంకుల ద్వారా మొదట రూ.10 వేలు రుణం అందించింది. రెండో విడుతలో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయించినా ఇవ్వలేదు. ఈ పథకం ప్రారంభంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పలు చెప్పారు. కానీ ఆస్థాయిలో పీఎం స్వనిధి అమలు కాలేదు. రుణాలు ఆశించిన వారంతా మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిజామాబాద్ నగరంలో 17,849 మంది, బోధన్‌లో 4408, ఆర్మూర్‌లో 3510, భీమ్‌గల్‌లో 865 మంది వీధి వ్యాపారులుంటే కేవలం 3వేల మందికే మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు. రెండో విడుతలో కూడా అలాగే వ్యవహరించారు.
రూ.400 ఉన్న గ్యాస్ బండ ధరను ఏకంగా రూ.1150 చేసిండ్రు. ఇంకా ప్రజల వద్దకు ఎట్ల వస్తరు. ప్రజలంటే ఏం తెలియని అమాయకులని అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు ఏకమైతే కేంద్రాన్నే వంచే శక్తి ఉన్నదని తెలంగాణ ఉద్యమమే గుర్తు చేస్తది. మీ ఎనిమిదేండ్ల పాలనలో గ్యాస్ బండ ధరను పెంచి నిరుపేద, మధ్యతరగతి వర్గాల నడుం విరగొట్టిండ్రు.
-మదారి సాయిలు, బీర్కూర్
అంగట్లో కూరగాయల ధరలు, కిరాణా దుకాణాల్లో సరుకుల ధరలు, ఇక పెట్రోల్, డీజిల్ ధరలైతే మండిపోతున్నాయ్. ఇంతగా ధరలను పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవికి అనర్హుడు. దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన వెంటనే దిగిపోవాలి. తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలకు కూడా ఈ పథకాలను అమలు చేయాలి.
-రామాగౌడ్, భైరాపూర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 పంచాయతీలున్నాయి. ఉపాధి హామీ పథకం కింద రెండు జిల్లాల్లో 5.27లక్షల జాబ్ కార్డులుండగా, 10.80 లక్షల మంది కూలీలున్నారు. ఈ పథకం అమలులో జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లా మూడు సార్లు టాప్‌లో నిలిచింది. కూలీ డబ్బుల చెల్లింపు, పని దినాల కల్పనలో తెలంగాణ కూడా అవార్డులు దక్కించుకున్నది. ఈ పథకాన్ని బంద్ చేసి పేదలను రోడ్డున పడేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. ఈ విషయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియంది కాదు. ప్రస్తుతం ఒక గ్రామానికి నెలకు 40 -50 పని దినాలు ఉంటే ఇకపై 22 పని దినాలు మాత్రమే వర్తింపజేయననున్నారు. పని దినాల ఆధారంగా నిజామాబాద్ జిల్లాలో కూలీలకు అందే మొత్తం రూ.150 కోట్లు ఉండగా, ఇప్పుడది సగానికి సగం తగ్గిపోనున్నది. పేద ప్రజల నోటికాడి బుక్కను బీజే పీ సర్కారు లాక్కుంటున్నది.
బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రం.. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయడంలో వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇందుకు నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక శాఖనే అన్ని రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తూ ప్రగతికి అవరోధంగా నిలుస్తున్నది. 15వ ఆర్థిక సంఘానికి సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను జోడించి కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు ఇస్తున్నది. పల్లెల వికాసానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి గాను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు జాతీయ అవార్డులు సైతం వరించాయి.
తెలంగాణలో రైతు ప్రయోజనకర పథకాలెన్నో అమలవుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా పథకాల మూలంగా కర్షకులకు ఎంతో మేలు జరుగుతున్నది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతోపాటు సాగు రంగం జోరుగా వృద్ధి చెందింది. అయితే, కేంద్రం తీరుతో రైతులకు అన్యాయం జరుగుతున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ వట్టి మాటగానే మిగిలిపోయింది. రైతు ఆదాయం రెట్టింపు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కర్షకుడి సంపాదన సగటున రూ.13వేలుగా ఉంది. దేశంలో రైతుల సగటు ఆదాయం రూ.6వేలు మాత్రమే. వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడుకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచే వ్యూహాలను అమలు చేస్తామని కేంద్రం చెప్పినప్పటికీ ఆ దిశగా చర్యలు లేవు. పైగా ఆయిల్‌పామ్ విత్తన దిగుమతిపై సుంకాలు పెంచి మోదీ సర్కారు జేబులు నింపుకొంటున్నది.
కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేండ్ల క్రితం తీసుకొచ్చిన పీఎం ముద్ర యోజన నత్తను తలపిస్తున్నది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న వారు ప్రైవేటు సంస్థలు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడమే ‘ముద్ర’ లక్ష్యం. చిన్నతరహా పరిశ్రమలు, సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసే వారు ఈ పథకానికి అర్హులు. ముద్ర లోన్ పేరిట భారీగా ప్రచారాలు చేసినప్పటికీ అర్హులైన వారికి ఎక్కడా రుణాలు మంజూరు చేయలేదు. బీజేపీ కార్యకర్తలకు మాత్రమే తరుణ్ విభాగం కింద రూ.10 లక్షలకు పైగా మంజూరయ్యాయి. మిగిలిన వారికి రూ.50వేలలోపే శిశ్ విభాగ్ ద్వారా రుణాలు ఇచ్చి మమ అనిపించారు.
సేద్యం పనులు ప్రారంభమైతే చాలు.. విత్తనాలు, ఎరువులు, కూలీలు, యంత్రాల అద్దె, ఇలా పెట్టుబడి ఖర్చులకు పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంట రుణాలు అందించాలని ప్రభుత్వం బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నది. ఆ ప్రకారం అమలు చేస్తే ప్రయోజనం ఉండేది. క్షేత్రస్థాయిలో అధికారులు మొండికేయడంతో అవస్థలు తప్పడం లేదు. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు రైతును ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ రైతుబంధుతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతున్నది. అందులో భాగంగానే అనేక ఆర్థిక పరమైన ఆంక్షలను విధిస్తూ ఫక్తూ రాజకీయాలను చేస్తున్నది. సబ్సిడీని క్రమంగా తగ్గించుకుంటూ పోషకాధారిత ఎరువుల విధానం తీసుకొస్తామని చెప్పిన కేంద్రం తర్వాత ఆ సంగతిని విస్మరించింది. ఎరువుల సబ్సిడీపై కోత పెట్టి రైతులకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎరువుల రాయితీ ఎత్తివేయడం ద్వారా 5 లక్షల మంది కర్షకులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రతి సీజన్లో రమారమీ రూ.200 కోట్ల భారం పడుతున్నది.
కోట్లాది మంది ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు మోదీ సర్కారు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి తగ్గించింది. 2015-16లో 8.8శాతంగా ఉన్న పీఎఫ్ రేటును 2020-21లో ఇది 8.5 శాతానికి, తాజాగా 8.1 శాతానికి కుదించింది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంత జీవనం కోసం నిలకడైన పొదుపు సాధనంగా పరిగణించే పీఎఫ్ డిపాజిట్లపై రేటును తగ్గించడం కోట్లాది మంది చందాదారుల్ని హతాశుల్ని చేసింది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించి అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే 12 లక్షల మందికి ఆమె అన్యాయం చేశారు.
ప్రపంచంలో పంటల సాగుకు పెట్టుబడి కింద ఎకరాకు రూ.10వేలు ఇస్త్తున్న సర్కారు తెలంగాణ తప్ప ఇంకెక్కడా లేదు. ఈ పథకాన్ని కాపీ కొడుతూ మోదీ తెచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి నవ్వుల పాలవుతున్నది. కేంద్రం ఇప్పటి వరకు 11 దఫాల్లో 1.60 లక్షల మందికి ఎకరాకు రూ.2వేలు చొప్పున రూ.320 కోట్లు ఇచ్చింది. అదే ఒక్క పంట సీజన్‌కే కేసీఆర్ ప్రభుత్వం సుమారుగా 2 లక్షల మందికి రూ.267 కోట్లు జమ చేస్తున్నది. ఒక్క నిజామాబాద్ జిల్లా రైతులకే 8 విడతల్లో రూ.2120 కోట్ల పెట్టుబడి సాయం అందజేసింది.
