నిజామాబాద్, మార్చి 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేసిన భారీ ఉద్యోగ ప్రకటన ఉద్యోగార్థులకు సంతోషం కలిగించింది. ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కంటున్న యువత ప్రిపరేషన్‌కు సిద్ధమవుతున్నారు.ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన క్షణం నుంచి యువత ఒక్కసారిగా పోటీ పరీక్షల వైపు దృష్టి సారించారు. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉద్యోగాలు రాక నిరాశ చెందిన వారంతా జంబో ఉద్యోగ ప్రకటనలో తమ చోటును పదిలం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. త్వరలోనే నియామకాలకు ప్రకటనలు ఒక్కోటి జారీ కానున్న నేపథ్యంలో నిరుద్యోగులందరూ పోటీ పరీక్షలపై సీరియస్‌గా దృష్టి సారించారు. భారీగా ఉద్యోగ నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తనవంతు సహకారం అందించేందుకు సిద్ధం అవుతున్నది. యువతకు తాత్కాలిక స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. సీఎం కేసీఆర్ సూచనతో పోలీస్ శాఖ సైతం శిక్షణ తరగతులకు సిద్ధం అవుతున్నది.
పోలీసు శాఖ ఆహ్వానం…
మొదటి నుంచి యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీస్ శాఖ బాధ్యతగా పని చేస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనూ ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు అండగా నిలిచారు. పోలీసు కొలువులపై ఆసక్తి ఉన్న వారిని రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఆయా జిల్లాల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించారు. శారీరక, మానసిక దృఢచిత్తం కలిగించేందుకు పాటుపడ్డారు. పోలీస్ కొలువులంటే రాత పరీక్షకు ముందుగా శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. అంతేగాకుండా లాంగ్ జంప్, హైజంప్, రన్నింగ్ వంటి పోటీలను ఎదుర్కోవాలి. ఇలాంటి శారీరకమైన పోటీలకు యువతను తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ తగు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జంబో నోటిఫికేషన్లో 18వేలకు పైగా పోలీస్ కొలువులు భర్తీ కానున్న నేపథ్యంలో యువతను ప్రోత్సహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బాసర జోన్ పరిధిలోని జిల్లా పోలీస్ అధికారులతో బుధవారం సమావేశమైన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఇదే అంశంపై చర్చలు జరిపారు. ఆయా జిల్లాల్లో పోలీస్ శిక్షణ కేంద్రాలు, ఫంక్షన్ హాళ్లు, ఇతరత్రా సౌకర్యవంతమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని యువతకు పోలీసు కొలువులకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ ఇప్పించాలని ఐజీ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఏర్పాట్లు సైతం వేగవంతం చేయడంపై సీపీ నాగరాజు దృష్టి సారించారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువతకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కేటీఆర్ పిలుపును అందుకున్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని యువతకు అండగా నిలిచేందుకు రెడీ అయ్యారు. పోలీసు కొలువులతో పాటు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయబోయే అన్ని రకాల పోస్టులకు అవకాశం ఉండేలా శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ల పరంపర కొనసాగబోతున్న సందర్భంగా ఎమ్మెల్యేలు ఇప్పటికే శిక్షణ తరగతులకు సరిపడా స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నియామకాల సందడి ఏర్పడడంతో శిక్షకుల కొరత కనిపిస్తోంది. నాణ్యమైన బోధనను అందించే శిక్షకుల కోసం పలువురు ఎమ్మెల్యేలు వేట ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా ఈ విషయంలో మొదటగా స్పందించారు. ఆర్మూర్‌లో తాత్కాలిక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి యువతకు సహకారం అందిస్తానని ప్రకటించారు. ఇదే బాటలో మిగిలిన ఎమ్మెల్యేలు సైతం నడవబోతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుపై యువత నుంచి మంచి స్పందన వస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారికి ఈ కార్యక్రమాలు ప్రయోజనం కలిగిస్తాయని వారంతా భావిస్తున్నారు.
బీసీ స్టడీ సెంటర్లో…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సెంటర్ చాలా రోజులుగా కొనసాగుతోంది. తాత్కాలిక భవనంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో వందలాది మంది నిత్యం పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వమే ఉచితంగా పోటీ పరీక్షల కోసం శిక్షణ అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం టీ, స్నాక్స్ సైతం అందిస్తున్నది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి బీసీ స్టడీ సెంటర్లకు యువత బారులు తీరేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఉద్యోగాలన్నింటికి ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, రైల్వే, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వంటి నోటిఫికేషన్లకు శిక్షణ తరగతులు జరిగేవి. భారీ నోటిఫికేషన్ల జాతర మొదలుకానున్న నేపథ్యంలో బీసీ స్టడీ సెంటర్లోనూ తరగతుల నిర్వహణ జరుగనున్నదని తెలుస్తోంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా విజృంభన సమయంలోనూ నిజామాబాద్ బీసీ స్టడీ సెంటర్లో ఆన్లైన్ తరగతుల ద్వారా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధత కొనసాగింది.