బోధన్ రూరల్, మార్చి 17 : హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. కానీ హోలీ పండుగ సందర్భంగా బోధన్ మండలంలోని హున్సా గ్రామం లో ప్రత్యేకంగా నిలుస్తున్నది పిడిగుద్దులాట. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం కొట్టుకుంటారు. హోలీ పండుగా వచ్చిందంటే చాలు గ్రామంలో సందడి నెలకొంటుంది. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. జిల్లాలోనే హున్సా పిడిగుద్దులాట ప్రత్యేకంగా నిలుస్తుంది. పిడిగుద్దులాట బయటివారికి విచిత్రంగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం ఆచారంగా భావిస్తారు.
ఎలా ఆడుతారు..
పిడిగుద్దులాట బాక్సింగ్ ఆటను తలపిస్తుంది. కొన్ని ఏండ్లుగా ఈ ఆట ఆచారంగా వస్తున్నదని గ్రామస్తులు చెబుతారు. హోలీ పండుగ రోజున గ్రామంలో రంగులు చల్లుకొని సందడి చేస్తారు. సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొని పిడిగుద్దులాట ప్రారంభిస్తారు. అక్కడ పెద్దతాడును అడ్డంగా కడతారు. ఆ తాడుకు రెండు వైపులా మోహరించిన గ్రామస్తులు సుమరు 5 నుంచి 10 నిమిషాల పాటు కొట్టుకుంటారు. ఈ పిడిగుద్దులాటలో ఎలాంటి గాయా లు అయిన మందులను రాసుకోరు. అక్కడి మట్టిని గాయాలకు రాసుకుంటే తగ్గిపోతాయని వారి నమ్మకం. పిడిగుద్దులాట తర్వాత ఒకరికొరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొంటారు. ఈ ఆటను ఆడ కుంటే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. శుక్రవారం పిడిగుద్దులాట నిర్వహించేందుకు హున్సా గ్రామం సిద్ధమైంది.
పూర్వీకుల నుంచి వస్తున్న ఆట
గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్నది. ఈ ఆటను నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతుంది. కామదహనం చేసిన మరుసటి రోజు సాయంత్రం పిడిగుద్దులాటను నిర్వహిస్తాం.
-శంకర్, మాజీ ఎంపీటీసీ హున్సా
ఆట ఆటకుంటే గ్రామానికి అరిష్టం
పిడిగుద్దులాటను ఆడకుంటే గ్రామానికి అరి ష్టం జరుగుతుంది. ఈ ఆటను నిర్వహిస్తేనే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. పంట లు చల్లగా ఉంటాయి. గతంలో ఆటను నిర్వహించకపోతే అనర్థాలు జరిగాయి.
-పీరాజి, మాజీ సర్పంచ్, హున్సా