ఖలీల్వాడి మార్చి 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో నిజామాబాద్ నగర పాలక సంస్థ అధికారులు ఆస్తి పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మొండి బకాయిలు చెల్లించనివారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూలు లక్ష్యం రూ.48.66 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.27 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూలుకు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఆఫీసర్లు, బిల్కలెక్టర్లు ఉంటారు. జప్తు నోటీసులు అందిన తర్వాత ఇప్పటి వరకు 500 మంది పన్ను చెల్లించారు. లేదంటే భవనాలు, షాపులను సీజ్ చేస్తున్నామని, ఇండ్లల్లోని టీవీలు, ఫ్రీజ్లను జప్తుచేస్తున్నామని అధికారులు చెప్పారు. నగరంలో మొత్తం 80 వేల నివాసాలు ఉండగా, ఇందులో 2,680 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. 900 మంది ఆస్తులను సీజ్ చేసినట్లు వివరించారు.
వంత శాతం పన్ను వసూలు చేస్తాం..
నగర పరిధిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం. సకాలంలో పన్నుచెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి. నోటీసులు అందుకున్న వారు స్పందించకపోతే ఆస్తులను జప్తుచేస్తాం. ఇప్పటివరకు రూ. 27 కోట్లు వసూలు చేశాం.
-రవిబాబు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్