మెండోరా, జూలై 21 : ఎస్సారెస్పీ 22 వరదగేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,953 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఏఈఈ వంశీ తెలిపారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదను గోదావరిలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 45 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 2,500, కాకతీయ కాలువకు 3,500, వరద కాలువకు 10వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 158.503 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. దీంతో దిగువ గోదావరి, కాకతీయ కాలువ, వరదకాలువలకు కలిపి 100.549 టీఎంసీలు వదిలినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1088.6 అడుగుల (78.342 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ వివరించారు.
ప్రాజెక్టును సందర్శించిన రెండు జిల్లాల కలెక్టర్లు, కేంద్ర బృందం
ఎగువ ప్రాంతాల నుంచి కొన్ని రోజులుగా వరద కొనసాగుతుండడంతో ఎస్సారెస్పీని నిజామాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, ముషారఫ్ ఫారూఖీ గురువారం సందర్శించారు. వారితోపాటు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సం యుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాట్, కృష్ణ ప్రసాద్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం వరద పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను ఈఈ చక్రపాణిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న మిగులు జలాల వివరాలు తెలుసుకుని వరదగేట్లను పరిశీలించారు. ఎస్సారెస్పీ అధికారులు వరదను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట డీఈ సుకుమార్, ఏఈఈ వంశీ ఉన్నారు.