బోధన్, మార్చి 16: వారంతా 39 సంవత్సరాల కిందట బోధన్‌లోని శక్కర్‌నగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు. 1982-83లో ఎస్సెస్సీ పూర్తిచేసుకొని.. అప్పటి నుంచి విడిపోయారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో స్థిరపడ్డారు. వారంతా 39 సంవత్సరాల అనంతరం బుధవారం ఒకే చోట కలుసుకున్నారు. పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం పేరిట ఈ అపూర్వ సన్నివేశానికి శక్కర్‌నగర్‌లోని రామాలయం వేదికైంది. రామాలయంలోని కల్యాణ మండపంలో కలుసుకున్న వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాటి అల్లరి, ఆటలు, తమ గురువులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కొందరు ఆనందభాష్పాలు రాల్చారు. తాము చదువుకున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి.. తరగతి గదులను చూశారు. ప్రేమగా, ఆప్యాయంగా తరగతి గదులను స్పృశిస్తూ.. పారవశ్యం పొందారు. మధ్యాహ్నం వేళ కలిసి భోజనాలు చేశారు. సమ్మేళనంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరులో స్థిరపడిన సామాజిక సేవకురాలు బి.జ్యోతి జైన్, పూర్వ విద్యార్థినులు నూర్జాహాన్ బేగం, మంగ, అరుణ, తార, సుహాసిని, సుకన్య, రుక్మిణి, వసంత, మల్లేశ్వరి, రమ తదితరులు పాల్గొన్నారు.
మరుపురాని మధుర సన్నివేశం..
1982-83లో పదో చదువుకున్న మేమంతా ఇక్కడ కలుసుకోవడం మా జీవితాల్లో మరుపురాని మధురమైన సన్నివేశంగా మిగులుతుంది. నేను కర్ణాటకలోని మంగళూర్ నుంచి వచ్చా. అక్కడ తుళునాడు రక్షణ వేదిక మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నాను.
– బి.జ్యోతి జైన్, మంగళూరు, కర్ణాటక
ఆనంద పారవశ్యంలో..
ఎక్కడెక్కడో స్థిరపడిన మేమంతా చాలా ఏండ్ల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉంది. 39 సంవత్సరాల అనంతరం ఇలా అందరం ఒకేచోట కలుసుకుంటామని అనుకోలేదు. చిన్ననాటి స్నేహితులమైన మేమం తా ఒకే చోట కలుసుకోడంతో చాలా ఆనందంగా ఉంది.
-నూర్జహాన్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు