నిజామాబాద్ రూరల్/ ఖలీల్‌వాడి (మోపాల్), జూలై 10 : మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల్లో పూడిక తీయడం ద్వారా నీరు ఎక్కువగా నిల్వ ఉండే పరిస్థితి ఇప్పుడు కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రూరల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ అమలుచేసిన మిషన్ కాకతీయ పథకం ఇందుకు ఎంతగానో దోహదపడిందని అన్నారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చెరువుకట్టలను బలోపేతం చేయడం, శిథిలావస్థకు చేరిన చోట కొత్త తూములు, అలుగులు నిర్మించడం ద్వారా చెరువులన్నీ పటిష్టవంతంగా తయారయ్యాయని చెప్పారు. చెరువులను పునరుద్ధరించడంతోనే భారీ వర్షాలు కురిసినా తెగిపోకుండా, గండ్లు ఏర్పడే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈగ సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్ రూరల్, జూలై 10 : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ ఈఈ అశోక్‌కుమార్, డిప్యూటీ ఈఈలు ప్రేమ్‌కుమార్, బాల్‌రాజ్, గంగాధర్, ఏఈలతో ఆదివారం సమావేశం నిర్వహించి వర్షాలపై సమీక్షించారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న చెరువులు, కుంటల పరిస్థితి ఎలా ఉందనే విషయమై అధికారులతో మాట్లాడారు. జక్రాన్‌పల్లి మండలంలో ఆరు కుంటలకు గండ్లు ఏర్పడ్డాయని మండల ఏఈ తెలుపగా.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో మొత్తం 304 చెరువులు ఉన్నాయని, ఇందులో 78 చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మల్కాపూర్ తండా చెరువుకు ఏర్పడిన లీకేజీల సమస్యను పరిష్కరించడానికి, ఇతర పనులు చేపట్టడానికి రూ.32 లక్షలు అవసరముంటుందని ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపామని ఎమ్మెల్యే తెలిపారు. గడ్కోల్ చెక్‌డ్యామ్ పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. సమావేశంలో ఏఈలు రాజ్యలక్ష్మి, మాధురి, సాయినాథ్, ప్రశాంత్, శ్రీచంద్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలకు రూ.28 కోట్లు మంజూరు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన ఏడు గ్రామాలకు తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీయూఐడీ) ద్వారా రూ. 28 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నిధులతో చేపట్టాల్సిన బీటీ, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణంపై మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఈఈ మురళీ మనోహర్‌రెడ్డి, ఏఈ యోగేశ్‌తో సమీక్షించారు. ఒక్కో డివిజన్‌కు రూ.4కోట్లు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. మాధవ్‌నగర్, పాంగ్రా, బ్యాంకు కాలనీ, బోర్గాం(పీ) తదితర కాలనీల్లో బీటీ, సీసీ రోడ్లతో డ్రైనేజీల నిర్మాణంపై చర్చించారు. ప్రతిపాదించిన పనులకు ఈ నిధులు వెచ్చించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈగ సంజీవ్‌రెడ్డి, నుడా డైరెక్టర్ అభిలాష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, సాంబశివరావు, రాజాగౌడ్, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.