అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురి మృతితో చిల్లర్గి గ్రామం శోక సంద్రంలో మునిగి పోయింది. కాటేపల్లి, తుగ్దల్, బాన్సువాడల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ‘అంగడి’ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రమాదంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పిట్లం, మే 9: ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, వారి పిల్లలకు అండగా ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రమాదంలో పిట్లం మండలం చిల్లర్గికి చెంది న ఆరుగురు మృతి చెందగా వారి కుటుంబాలను స్పీకర్ పోచారం, ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం పరామర్శించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎంపీ బీబీపాటిల్‌తో కలిసి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.50వేల ఆర్థికసాయం ప్రకటించినట్లు చెప్పారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉండడం వారి కుటుంబాలకు తీరని లోటని, మృతులు నిరుపేద దళితులు కావడం బాధాకరమన్నారు. మృతుల పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పించి ఆదుకుంటామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మాణిక్యం భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించగా ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులకు సూచించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను కదిలిస్తే కన్నీళ్లు రాలుతున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కొల్పోయి అనాథగా మారిన కుటుంబం ఒకటయితే.. అత్తాకోడలు ఒకేసారి మృతిచెందడంతో ఆడదిక్కు లేని కుటుంబం మరొకటి..భర్త మృతి చెంది ఒంటరిగా మిగిలిన భార్య.. భార్య మరణించి ఒంటరైన భర్త ఇలా.. ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం విదితమే. అయితే తొమ్మిది మందిలో ఆరుగురు పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారే. సోమవారం ఆరుగురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతులవన్నీ రెక్కాడితే డొక్కాడని కుటుంబాలే. చిల్లర్గికి చెందిన ఆరుగురితోపాటు బాన్సువాడ, కాటేపల్లి, తుగ్దల్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబాలది సైతం ఇదే పరిస్థితి.
పెద్ద దిక్కును కోల్పోయి..
పోచయ్యకు భార్య ఈరవ్వ, కుమారులు సాయిలు, బాల్‌రాజ్ ఉన్నారు. కూలీ పనులు చేస్తేనే పొట్టగడిచేది. ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబపోషణ భారంగా మారనున్నది. ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
మాణిక్యం తల్లి కూడా..
ఇటీవల మరణించిన మాణిక్యం తల్లి వీరవ్వ కూడా ఈ ప్రమాదంలో మరణించింది.
తల్లి మృతితో..
సాయవ్వది వ్యవసాయ కుటుంబం. భర్త కేశయ్య. వీరికి కుమారుడు శివ, కుమార్తె పుష్పలత ఉన్నారు. తల్లి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంలో మరణించిన డ్రైవర్ సాయిలుది పెద్దకొడప్గల్ మండలం తుగ్దల్ గ్రామం. వీరికి బంధువు కావడంతో ఈయన కూడా వచ్చాడు. కొన్ని రోజుల కిందట సాయిలు హైదరాబాద్‌లో ఆటో నడుపుకొంటూ జీవనం కొనసాగించాడు. ఇతనికి భార్య మానస, కుమారుడు రిషి, కుమార్తె ఐష్ ఉన్నారు. బాన్సువాడకు చెందిన మరో బంధువు అంజవ్వ, పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లికి చెందిన ఎల్లయ్య సైతం మృతి చెందారు.
తలకొరివి పెట్టిన కూతురు
ప్రమాదంలో మరణించిన గంగామణికి భర్త సాయిలు, కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. వీరంతా కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కుమార్తెకు ఇంకా పెండ్లి కాలేదు. గంగామణి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. భర్త సాయిలు సైతం ఇదే ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి దవాఖానలో ఉండడంతో తల్లి అంత్యక్రియలను కుమార్తె నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ బీబీపాటిల్
చిల్లర్గి గ్రామానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలకు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున నగదును అందజేశారు. చిల్లర్గి గ్రామంలో ఆరుగురికి, కాటేపల్లి గ్రామంలో ఒకరికి, తుగ్దల్ గ్రామంలో ఒకరి ఇంటి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వీరి వెంట జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కవితావిజయ్, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార, బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, కృష్ణారెడ్డి, కుమ్మరి రాములు, మురళీగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.