నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆర్మూర్/మాక్లూర్, మే 6: ప్రపంచంలో రైతుకు ఎదురొచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు తెలంగాణ మాత్రమేనని, కేసీఆర్ తీసుకువచ్చిన సాగు విప్లవంతోనే రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఎకరా భూమి రూ.20లక్షలు దాటిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లిలోని అపురూప వేంకటేశ్వర ఆలయ ప్రాంగణం ఆవరణలో వానకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. మొదట రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అపురూప వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. పంటల మార్పిడితో రైతులు అత్యధిక లాభాలు గడించగలుగుతారని, వివిధ ప్రాంతాల రైతుల విజయగాథలను రైతులకు వివరించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు మీద రైతులు ప్రధానంగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. యూపీలో రైతులు 30లక్షల ఆయిల్ ఇంజన్లు నడుపుకొంటున్నారని స్థానిక బీజేపీ నేతలు సిగ్గుపడాలన్నారు. ఇక్కడకొచ్చి రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు రైతులు సహకార సంఘంగా ఏర్పడి మిల్లును ఏర్పాటు చేసుకునేలా ప్రయత్నం చేయాలని సూచించారు.
రైతుల ఐక్యతే రాష్ర్టానికి బలం..
అన్నదాతలను, వ్యవసాయాన్ని గౌరవించాలని, రైతుల ఐక్యతే రాష్ర్టానికి బలమన్నారు. సంపూర్ణంగా ప్రజల విశ్వాసం కోరేది, ప్రజల సంక్షేమం ఆశించేది, ప్రజలను సంతోషంగా ఉంచేది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. పోచంపాడ్‌ను నిర్మించింది పాలమూర్ కూలీలేనని వివరించారు. నిజాం సర్కారులో దేశంలో కట్టిన తొలి భారీ ప్రాజెక్టు నిజాంసాగర్ అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చింది కేసీఆర్ సర్కారేనని చెప్పారు. రాష్ట్రంలో కేవలం మూడేండ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీలో పోసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక సాగు రంగం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నదని, వారికి మతం తప్ప మిగిలిన అంశాలేవి పట్టడం లేదని వివరించారు. రైతుల అవసరాలు, ఆవశ్యకతను గమనించే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగు నీళ్లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే ముందు వరుసలో ఉన్నదన్నారు. తెలంగాణ పంటలను కొనలేక కేంద్రం చేతులు ఎత్తేసిందని, 140 కోట్ల దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చేది కేవలం ఐదారు రాష్ర్టాలు కాగా అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్నారు. సదస్సులో ఎమ్మెల్యే జాజాల సురేందర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మహి ళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదాన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, ఇరు జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్,తెలంగాణ రైతు ఆగ్రోస్ ఎండీ రాములు, డీఏవో గోవింద్, రైతుబంధు సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీలు, జడ్పీటీసీలు, విండో చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రైతును రాజు చేసిండు సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
రైతులే తమ దేవుళ్లని, వారి శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే ప్రభుత్వం తమదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర అని, రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటి ఎకరాలకు నీరిచ్చేలా సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టించారన్నారు. రూ.25వేల కోట్లతో చెరువులు బాగు చేశారని, రూ.41వేల కోట్లతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని, రైతుబంధు ద్వారా రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని, రూ.35వేల కోట్ల రుణమాఫీ చేశారని, ఏ కారణంతోనైనా రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5లక్షల చొప్పున చెల్లించేలా రైతుబీమా అమలు చేశారని వివరించారు. దాదాపు 3లక్షల కోట్ల రూపాయలను కేవలం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశారని, ఫలితంగా తెలంగాణ వ్యవసాయంలో పంజాబ్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచేస్థాయికి చేరుకుంద న్నారు. ప్రతిపక్షాలు రాష్ర్టానికి శనిలా దాపురించాయని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో రాజకీయ కోతులు
రాష్ట్రంలో కొన్ని రాజకీయ కోతులు వితండవాదం చేస్తున్నాయని, వీరి వ్యవహారం బండి కింద కుక్కల మాదిరిగా మారిందని ప్రతిపక్ష పార్టీల వైఖరిపై రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. రైతులకు మేలు చేసేది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. నిజామాబాద్ రైతుల ముందే కేసీఆర్ రైతుబంధు పథకం ప్రకటించారని చెప్పారు. ఇప్పటి వరకు ఎనిమిది విడతల్లో రైతుబంధు వచ్చిందని, ఏటా రూ.15వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. ఏడేండ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఇందుకు కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలే కారణమని పల్లా వివరించారు. నిజామాబాద్ జిల్లాను, ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలోని అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయ పద్ధతులు, మెళకువలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతారన్నారు. ఈ జిల్లా రైతుల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా వ్యవసా యాధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు కృషి చేయాలన్నారు.
అగ్రస్థానంలో తెలంగాణ వ్యవసాయం..
సీఎం కేసీఆర్ ఏడేండ్లలో రాష్ట్ర వ్యవసాయాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలో రైతుల గురించి 24 గంటలు ఆలోచించే వ్యక్తి కేసీఆరేనని తెలిపారు. ఒకప్పుడు 20 ఎకరాల భూమి ఉన్నా పిల్లనిచ్చేవాళ్లు కాదని, నేడు ఉద్యోగం ఉన్నా భూమి ఎంత ఉందని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కేసీఆర్ పాలన గొప్పతనం తెలియజేసేందుకు అని వివరించారు. ఏ ముఖం పెట్టుకొని వరంగల్‌లో రైతుసంఘర్షణ సభ నిర్వహిస్తున్నారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లు కాంగ్రెస్ పాలననే ఉందని, అప్పుడు వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ 3 విడుతలుగా ఇచ్చేదని, విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లో నిలబడే వారని గుర్తు చేశారు. కేసీఆర్ ముందుచూపు ఫలితంగా నేడు 2.4 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, ఏడేండ్లలో 70 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని వెల్లడించారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 18లక్షల ఎకరాలకు 12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 5లక్షలకు తగ్గించాలని కోరారు. సోయాబీన్ విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఇక్కడి రైతులకు పత్తి సాగు అలవాటు లేదని, విత్తనాలు అందుబాటులో ఉంచితే రైతులను ఒప్పించే బాధ్యత తమదని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మార్కెట్లో ఆదరణ ఉంటుందని, రైతులు పంటలు అమ్ముకోవడానికి ఎవరినీ యాచించాల్సిన అవసరం ఉండదన్నారు. పసుపు సాగును ఇక్కడి రైతులు లక్ష్మిగా భావిస్తారని.. అది సాగు చేయకుంటే ఒక వెలితిగా భావిస్తారని తెలిపారు. పసుపు బోర్డు ఆశతో రైతులు ఓట్లేస్తే ఒకడు మోసం చేశాడని, వాడికి రైతుల ఉసురు, శాపం తగులుతుందన్నారు. పసుపు సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గేలా, పసుపు దిగుబడి పెరిగేలా శాస్త్రవేత్తలు సాయమందించాలని కోరారు. ఏడేండ్లలో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు నిర్మించారని, ఉమ్మడి జిల్లాలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించాలని కోరారు.
వ్యవసాయ రంగానికి శ్రీరామరక్ష.. సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే గర్వకారణం. పార్లమెంట్లో రైతు సంక్షేమ పథకాల గురించి యావత్ దేశానికి వివరించాము. జిల్లాలోని ఆర్మూ ర్, బాల్కొండ ప్రాంతాల రైతులు గర్వకారణం. ఇక్కడి మహిళలు వ్యవసాయంలో దిట్ట.. అందుకు ఉదాహరణే అంకాపూర్ గ్రామం. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్ల కాలంలో లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించిన సీఎం కేసీఆర్.. వ్యవసాయరంగానికి, తెలంగాణకు శ్రీరామ రక్ష. నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాటిని రద్దు చేసేలా టీఆర్ఎస్ ఎంపీలందరం ఢిల్లీలో పోరాటం చేసినం. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్‌లో సెజ్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. పొలాల్లో కోతులు పడితే వాటి సంగతి రైతులు చూసుకుంటారు.. రాజకీయంలో కోతుల బెడద ఎక్కువైంది.. వాటి సంగతి మేము చూసుకుంటాం.
-కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు
ఆయిల్ పామ్‌పై అవగాహన కల్పించాలి
ఐదువేల జనాభాను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏఈవోలను నియమించింది. రైతులకు ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ రైతువేదికలను నిర్మించారు. ఏఈవోలు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి.
-వీజీగౌడ్, ఎమ్మెల్సీ