
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 3 : జిల్లావ్యాప్తంగా మూడో రోజైన శనివారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో జోరుగా కొనసాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామాల్లో ఉదయం నుంచే సందడి నెలకొన్నది. మురికి కాలువలను శుభ్రం చేయించడం, రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కల తొలగింపు, గడ్డిమందు పిచికారీ, పల్లె ప్రకృతి వనాలు, మంకీఫుడ్ కోర్టుల సందర్శన, మొక్కలు నాటుట, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామంలో పల్లెప్రగతి పనులను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రారంభించారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. వైకుంఠధామం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయని, ప్రజలకు మౌలిక వసతులు సమకూరాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు విజయ్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి, చిన్నకొడప్గల్ సర్పంచ్ కవిత పాల్గొన్నారు.
మద్నూర్ మండలకేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రామ్‌పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచ్ దరాస్ సూర్యకాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనుపటేల్ పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగాయి. సర్పంచులు పల్లెప్రగతిపై గ్రామాల్లో అవగాహన కల్పించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని వదల్పర్తి గ్రామాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతి నిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను, సర్పంచ్ ప్రవీణ్, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ వినితారెడ్డి, ఎంపీపీ రాజదాస్ తదితరులు ఉన్నారు. గోపాల్పేట్ గ్రామంలో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మండల స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్ పరిశీలించారు. వదల్‌పర్తిలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. రామారెడ్డి మండలం గొల్లపల్లిలో సర్పంచ్ లావణ్య ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు.
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి
ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలను నాటి సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ బల్దియా పరిధిలోని 1,2,6,7,11వ వార్డుల్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ద్విచక్రవాహనంపై పర్యటించారు. వార్డుల వారీగా కౌన్సిలర్లు, కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. ఏడో వార్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడ కనిపించిన చెత్తను మురికి కాలువ నుంచి తొలగించారు. ఒకటో వార్డులోని ఆర్అండ్బీ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఏడో వార్డులోని సంగమేశ్వర కాలనీలో లబ్ధిదారుడు నిర్మించుకున్న డబుల్ బెడ్రూం ఇంటిని ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్, ఆర్అండ్బీ డీఈ పున్న మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట మండలం జనగామ గ్రామంలో పల్లెప్రగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. కంపోస్ట్‌షెడ్, వైకుంఠధామం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, మండల ప్రత్యేక అధికారి జితేంద్రప్రసాద్, సర్పంచ్ రాజు, ఎంపీవో మనోహర్ ఉన్నారు.
భిక్కనూర్ మండలం జంగంపల్లిలో, దోమకొండ మండల కేంద్రంతోపాటు లింగుపల్లి, అంచనూర్‌లో సైతం కలెక్టర్ పర్యటించారు. జంగంపల్లిలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవోలు అనంతరావు, చెన్నారెడ్డి, తహసీల్దార్లు నర్సింహులు, మోతీసింగ్, ఎంపీవోలు తిరుపతిరెడ్డి, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో సర్పంచ్ ఉమారాణి, పంచాయతీ కార్యదర్శి సంతోష్ మొక్కలను నాటారు. మంగ్లూర్లోని ఎస్సీ కాలనీల్లో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ స్వప్న, మండల ప్రత్యేకాధికారి సంజీవ్‌రావు, ఎంపీడీవో పర్బన్న, ఎంపీవో అబ్బాగౌడ్ పరిశీలించారు. అచ్చంపేటలో సర్పంచ్ అనుసూయ, ఎంపీటీసీ సుజాత, మంకీఫుడ్‌కోర్టును సందర్శించి మొక్కలు నాటారు. జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఎంపీవో యాదగిరి సర్పంచ్ లక్ష్మణ్‌తో కలిసి పర్యటించారు. కాలనీల్లో సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నిజాంసాగర్ మండలంలోని గిర్నితండా పంచాయతీలో సర్పంచ్ అనిత ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు.
గాంధారి మండలకేంద్రంలో సర్పంచ్ మమ్మాయి సంజీవ్ పలు వార్డుల్లో మొక్కలను అందజేశారు. బొప్పాజివాడిలో గ్రామస్తులు వైకుంఠధామానికి వెళ్లే దారికి ఇరువైపులా మొక్కలు నాటారు. పొతంగల్కలాన్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్‌ను మండల ప్రత్యేకాధికారి సుధీర్ పరిశీలించారు. ఎంపీడీవో సతీశ్, సర్పంచ్ బాలరాజు, ఎంపీవో రాజ్‌కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.
లింగంపేట మండలకేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు పరీలించారు. 14వ వార్డులో పర్యటించి మహిళలతో మాట్లాడారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలని సూచించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరిందని ప్రధానోపాధ్యాయుడు వహీద్ సిద్ధిఖీ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీడీవో శంకర్, ఎంపీవో ప్రభాకర్ చారి పాల్గొన్నారు. మాలోత్ సంగ్యానాయక్ తండాలో సర్పంచి బన్నీ మొక్కలను పంపిణీ చేశారు.
రాజంపేట్ మండలంలోని శివాయిపల్లిలో పల్లెప్రగతి పనులను రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ తిర్మల్‌రెడ్డి పరిశీలించారు. హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆయన వెంట డీఆర్డీవో మాధవరావు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, సర్పంచ్ విఠల్‌రెడ్డి, సీడీపీవో రోచిష్మ, ఎంపీడీవో బాలకిషన్ ఉన్నారు.
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో మండల ప్రత్యేక అధికారి షబానా ఎంపీడీవో కలం రాజ్వీర్, సర్పంచ్ పైడి జానకితో కలిసి గ్రామంలో పర్యటించి పల్లెప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో, మినీ వాటర్ ట్యాంక్ వద్ద పెరిగిన పిచ్చిమొక్కలను సర్పంచ్ జానకి తొలగించారు.
తాడ్వాయి మండలంలోని దేమికలాన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. చిట్యాల, సంతాయిపేటలో మండల ప్రత్యేకాధికారి వసంత పాల్గొని పల్లెప్రగతి పనులను పరిశీలించారు. చందాపూర్‌లో పనులను నోడల్ అధికారి విఠల్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో హప్సిబా, సర్పంచులు పౌరాజు, రాజమణి, కవిత పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం చిన్నదడ్గిలో సర్పంచ్ అనితా విఠల్‌రెడ్డి మొక్కలు నాటారు. పుల్కల్ గ్రామంలో రోడ్డుపై గుంతలను మొరంతో పూడ్చివేయించారు. కార్యక్రమంలో ఎంపీవో మహబూబ్ పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో సర్పంచ్ నారాయణరెడ్డి కార్యదర్శి గంగాధర్‌తో కలిసి ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. కొత్తబాదిలో సర్పంచ్ అంకిత, కార్యదర్శి నవీన్ కలిసి గ్రామంలో గుంతలను మొరంతో పూడ్చివేయించారు. బోర్లం, తాడ్కోల్, సోమేశ్వర్ గ్రామాల్లో డ్రైనేజీలను శుభ్రం చేయించడంతో పాటు గ్రామంలోని రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను కూలీలతో తొలగింపజేశారు. బీర్కూర్ తండా గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతిలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు పాల్గొని మొక్కను నాటారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. సర్పంచ్ ఇస్లావత్ దేవీబాయి, ఎంపీడీవో రాధమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరేశం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని 5, 29వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు. మొక్కలు నాటి వార్డుసభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. వార్డుల్లో తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న వైర్లను గుర్తించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు అస్మా ఇమ్రాన్, అంజద్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ కళాశాల విద్యార్థుల వసతిగృహం, బీసీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతిగృహంలో బీసీ వసతిగృహాల డెవలప్మెంట్ జిల్లా ఆఫీసర్ శ్రీనివాస్ మొక్కలను నాటారు. అనంతరం వసతిగృహాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట బీసీ వసతిగృహాల డెవలప్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ యాదగిరి, వార్డెన్లు నరేశ్, విజయశాంతి ఉన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని 2, 10వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు యజమానులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. రెండో వార్డులో నూతన విద్యుత్ స్తంభాలను, పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10వ వార్డులో కందకంలోని మున్సిపాలిటీ స్థలంలో అక్రమకట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.