వినాయక్‌నగర్, మార్చి 19: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో (Nizamabad) పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారిని విచారించి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న సందర్భంగా మైనారిటీలు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి వ్యాపారులతో మాట్లాడారు. అంతేకాకుండా రోడ్లపై పార్కింగ్, కబ్జాలు చేయడం వల్ల ట్రాఫిక్‌కు, జనాలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాపారులకు సూచించారు.
నగరంలోని ఎల్ఐసీ చౌరస్తా , దేవి రోడ్ చౌరస్తా, పులంగ్ చౌరస్తా, న్యాల్ కల్ చౌరస్తా, పెద్ద బజార్,నెహ్రూ పార్క్ ,హైమది బజార్, బోధన్ బస్టాండ్ ఏరియాల్లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అర్ధరాత్రివేల రోడ్ల పై తిరుగుతున్న ఆటోలకు సంబందించిన డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. అనవసరంగా, ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో తిరిగే యువతకు కౌన్సిలింగ్ చేశారు. మహారాష్ట్రలో చలరేగిన అల్లర్ల రకారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోలీస్ పికెట్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.