సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
ఉమ్మడి జిల్లాతో ముగ్గురికి అనుబంధం
నిజామాబాద్ లీగల్, ఆగస్టు 19 : రాష్ట్ర హైకోర్టుకు న్యా యమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ముగ్గురు జిల్లా జడ్జిలు పి.శ్రీసుధ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎం. లక్ష్మణ్ ఉమ్మడి జిల్లా న్యాయ వ్యవస్థలో అవినాభావ సంబం ధం ఉన్నవారే. సీనియర్ జిల్లా జడ్జిలు కావడం, సుదీర్ఘ అనుభవం ఉండడంతో వీరు రాష్ట్ర హైకోర్టుకు పదోన్నతిపై జడ్జిలుగా నియామకం కానున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే భారత రాజపత్రంతో వీరి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పి. శ్రీసుధ మే 5, 2019 నుంచి అక్టోబర్ 23, 2020 వరకు దాదాపు 18 నెలలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించి బదిలీ అయ్యారు. ఆమె 2003 జనవరి 6 నుంచి 25 ఏప్రిల్ 2003 వరకు నాలుగు నెలలు అప్పటి ఉమ్మడి జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పని చేశారు. జిల్లా జడ్జిగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న 18 నెలల కాలంలో తనదైన ప్రత్యేక ముద్రను కలిగి ఉన్నారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని దాదాపు రెండు లక్షల విత్తన బంతులను సారంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో వెదజల్లారు. హరితహారంలో భాగంగా వందలాది మొక్కలు నాటారు. మరీ ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం రుతుస్రావంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై సెమినార్లు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా ఉన్న ఎ.వెంకటేశ్వర్రెడ్డిది సుదీర్ఘ న్యాయ ప్రస్థానమే. ఆయన 15 మే, 2000 నుంచి 11 మే 2003 దాదాపు మూడు సంవత్సరాలు నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించారు. లక్ష్మణ్ మే 2, 2009 నుంచి జనవరి 25, 2012 వరకు నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. ముగ్గురిది సుదీర్ఘ న్యాయ ప్రస్థానమే. ఉమ్మడి జిల్లా న్యాయ వ్యవస్థతతో విడదీయలేని బంధం ఉన్నది. ముగ్గురు ఒకేసారి రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా సిఫార్సు కావడం గర్వకారణమేనని న్యాయవాద సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.